నిధులున్నా.. రోడ్ల విస్తరణ పనులపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2023-05-02T23:33:21+05:30 IST
నారాయణరావుపేట, మే 2: గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం నారాయణరావుపేట మండలం గోపులాపూర్‌లో రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించినా.. పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ఇళ్లు కోల్పోయే బాధితులకు భరోసా కరువు
విస్తరణ పనులకు రెండు సార్లు ముగిసిన అగ్రిమెంట్ గడువు
ప్రజాప్రతినిధుల మధ్య కుదరని ఏకాభిప్రాయం
నారాయణరావుపేట, మే 2: గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం నారాయణరావుపేట మండలం గోపులాపూర్‌లో రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించినా.. పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏడేళ్ల క్రితమే మంత్రి హరీశ్‌రావు నిధులు మంజూరు చేయించినా గ్రామంలోని ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. రోడ్డు విస్తరణలో సుమారు 22 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉన్నది. రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఇళ్లు పోయే బాధితులకు సరైన భరోసా ఇచ్చేందుకు గ్రామ ప్రజాప్రతినిధులు ముందుకురాకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయి. రోడ్డు విస్తరణ పనులకు రూ.80 లక్షల నిధులు మంజూరై ఉన్నాయి. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ గడువు కూడా రెండుసార్లు ముగిసింది. జక్కాపూర్ నుంచి నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా వెళ్లే వాహనాలకు గోపులాపూర్‌లో రోడ్డు విస్తరణ చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
గ్రామంలో మొదలైన ఓట్ల అంచనాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంవత్సరం గడువున్నా గోపులాపూర్‌లో ఓట్ల అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. గ్రామంలో చేపట్టాల్సిన రోడ్డు విస్తరణ పనుల్లో ముందుకొచ్చే నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు చిలిపోయే ప్రమాదం లేకపోలేదనే అంచనాలతో పనులకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
విస్తరణకు సహకరిస్తే వెంటనే పనులు
రోడ్డు విస్తరణలో సుమారు 22 ఇళ్లు కోల్పోతున్నారు. బాధితులు, గ్రామస్థులు సహకరిస్తే రోడ్డు విస్తరణ పనులు చేపడుతాం. రోడ్డు విస్తరణకు నిధులు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు విస్తరణ పనులకు కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ గడువు ముగిసింది.
- శ్రీకాంత్, ఆర్‌అండ్‌బీ జేఈ, సిద్దిపేట
పనులను త్వరలో పూర్తి చేస్తాం
రోడ్డు విస్తరణ గురించి బాధితులతో భరోసా కల్పిస్తున్నాం. గ్రామంలో పండుగ ఉన్నందున పనులు చేపట్టలేదు. నెలరోజుల వ్యవధిలో మంత్రి సహకారంతో రోడ్డు పనులు పూర్తిచేసి గ్రామాబివృద్ధికి కృషిచేస్తాం.
- కోట్టే రుక్కవ్వ, సర్పంచ్, గోపులాపూర్