ప్రజా సమస్యలపై సీపీఎం యాత్ర
ABN , First Publish Date - 2023-03-05T00:02:46+05:30 IST
సిద్దిపేట అర్బన్, మార్చి 4: బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టే బస్సుయాత్రను జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు.
13న ఆదిలాబాద్‌లో ప్రారంభం.. 17న సిద్దిపేటకు
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య
సిద్దిపేట అర్బన్, మార్చి 4: బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టే బస్సుయాత్రను జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ప్రమాదపు అంచుకు చేరుకున్నదన్నారు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం ధరలు విపరీతంగా పెంచి శతకోటీశ్వరులకు రాయితీలు ఇస్తూ పేదలపై భారం మోపిందని విమర్శించారు. మోడీ పాలనలో నిరుద్యోగం పరాకాష్టకు చేరిందని, మహిళలపై, దళితులపై, వెనుకబడిన తరగతులపై దాడులు కూడా పెరిగాయన్నారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణలో 12 జిల్లాల నుంచి ఈ యాత్ర కొనసాగుతుందని, 13న ఆదిలాబాద్‌లో ప్రారంభమయ్యే బస్సుయాత్రకు తనతోపాటు ఆరుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు నాయకత్వం వహించనున్నారని వీరయ్య తెలిపారు. 17న సిద్దిపేటకు చేరుకోనున్న యాత్రకు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సానుభూతిపరులు పార్టీ సభ్యులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శశిధర్, జిల్లా కమిటీ సభ్యులు రవికుమార్, దాసరి ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.