రండి.. రండి.!! మా స్కూళ్లో చేరండి

ABN , First Publish Date - 2023-06-07T00:11:23+05:30 IST

పాఠశాలలు తెరుచుకోనున్న వేళ గ్రామాల్లో ప్రచార సందడి నెలకొన్నది. మా బడిలో చేరండి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల బాట పడితే.. మా స్కూళ్లో చేరితే ఐఐటీ కోచింగ్‌ ఇప్పటి కోచింగ్‌ ఉచితంగా ఇస్తాం అంటూ ప్రైవేటు పాఠశాలలు ప్రచారం చేస్తున్నాయి.

రండి.. రండి.!! మా స్కూళ్లో చేరండి

గ్రామాల్లో ప్రచార జోరు

బడిబాటతో చిన్నారుల చెంతకు ప్రభుత్వ ఉపాధ్యాయులు

రంగురంగుల బ్రోచర్లు, ఆఫర్లతో ప్రైవేటు స్కూళ్ల ప్రచారం

12 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డిఅర్బన్‌ జూన్‌ 6: పాఠశాలలు తెరుచుకోనున్న వేళ గ్రామాల్లో ప్రచార సందడి నెలకొన్నది. మా బడిలో చేరండి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల బాట పడితే.. మా స్కూళ్లో చేరితే ఐఐటీ కోచింగ్‌ ఇప్పటి కోచింగ్‌ ఉచితంగా ఇస్తాం అంటూ ప్రైవేటు పాఠశాలలు ప్రచారం చేస్తున్నాయి. స్కూల్‌ టీచర్లు, సిబ్బంది, ప్రచార వాహనాలతో ఊళ్లలో సందడి నెలకొన్నది.

గ్రామాల్లో బడి బాట..

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం.. బడి బయట పిల్లల్ని చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ ఈ నెల 3 నుంచి 9 వరకు బడిబాట నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాల్లో ఐదేళ్ల వయస్సు నిండిన పిల్లల వివరాలను సేకరించి, వారి తల్లిదండ్రులను కలుస్తున్నారు. మీ బిడ్డల్ని మా పాఠశాలల్లో చేర్పించండని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం కోసం పట్టణాలకు పంపి ఆర్థిక భారాన్ని మోయాల్సి అవసరం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్‌ చదువులు చెప్తున్నామని నచ్చజెప్తున్నారు. మీ బిడ్డల భవిష్యత్తుకు మాదీ భరోసా.. అని హామీ ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు తోడుగా సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీల సహకారాన్ని తీసుకుంటున్నారు.

పాఠశాలల్లో చేరిన 2,870 మంది చిన్నారులు

సంగారెడ్డి జిల్లాలో బడిబాట సత్ఫలితాలిస్తున్నది. 3 నుంచి 6వ తేదీ వరకు 2,870 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఒకటో తరగతిలో 2,199 మంది చేరగా.. వీరిలో అంగన్‌వాడీల నుంచి 1,799 మంది, నేరుగా 337 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 63 మంది చేరారు. ఇతర తరగతుల్లో 671 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

ప్రైవేటు స్కూళ్ల రంగుల ప్రచారం

మరోవైపు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లు ముద్రించి, తమ సిబ్బందిని గ్రామాలకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. తమ స్కూళ్లో అడ్మిషన్‌ తీసుకుంటే గ్రామాలకే స్కూల్‌ బస్సును పంపుతామని భరోసా కల్పిస్తున్నారు. అకాడమిక్‌తో పాటు ఆటపాటలు నేర్పిస్తామని, ఇప్పటి నుంచే ఐఐటీకి సిద్ధం చేస్తామని చెబుతూ తల్లిదండ్రులను ఆకర్శించే యత్నం చేస్తున్నారు.

సర్కారు బడులపై విశ్వాసం పెరిగింది

- ఎస్‌. వెంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి జిల్లా

సంగారెడ్డి జిల్లాలో బడిబాట కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు, ప్రచారం నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడితో ప్రైవేటుకు దీటుగా వసతులు సమకూరుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో సర్కారు బడులపై విశ్వాసం పెరిగింది. తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి 10 శాతం ప్రవేశాలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

Updated Date - 2023-06-07T00:11:35+05:30 IST