Share News

సీఎంఆర్‌ బియ్యం పెండింగ్‌ 2.82 లక్షల టన్నులు

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:02 AM

పౌరసరఫరాలశాఖకు ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ అందజేయడంలో మెదక్‌ జిల్లాలో రైస్‌మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. గడువులోగా బియ్యం అందజేయాలని అధికారులు పలుమార్లు గడువు పొడిగించినా పెడచెవిన పెడుతున్నారు.

సీఎంఆర్‌ బియ్యం పెండింగ్‌ 2.82 లక్షల టన్నులు

డిసెంబరు 31 వరకు గడువు

2022-23 వానాకాలం, యాసంగి సీజన్లలో మిల్లుకు కేటాయించిన వడ్లు 6,86,541 మెట్రిక్‌ టన్నులు

వానాకాలం సీఎంఆర్‌ బకాయి 1,00,724 మెట్రిక్‌ టన్నులు

యాసంగిలో రావాల్సింది 1,81,487 మెట్రిక్‌ టన్నులు

మెదక్‌, డిసెంబరు 17: పౌరసరఫరాలశాఖకు ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ అందజేయడంలో మెదక్‌ జిల్లాలో రైస్‌మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. గడువులోగా బియ్యం అందజేయాలని అధికారులు పలుమార్లు గడువు పొడిగించినా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వడ్లను మర పట్టి బియ్యంగా మార్చి తిరిగి ఇచ్చేందుకు (కస్టం మిల్లింగ్‌ రైస్‌) రైస్‌మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లింగ్‌ చేసిన అనంతరం బాయిల్డ్‌ రైస్‌ అయితే 68 శాతం, రా-రైస్‌ అయితే 67 శాతం చొప్పున బియ్యాన్ని ఎఫ్‌సీఐకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు క్వింటాలుకు రూ.30 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికితోడు, పొట్టు, తవుడు కూడా మిల్లర్లకే మిగులుతాయి. కానీ సీఎఆర్‌ బియ్యం అప్పగించడంతో మిల్లర్లు అంతులేని ఆలస్యం చేస్తున్నారు.

గడువులోగా బియ్యం ఇవ్వడం కష్టమే..

మెదక్‌ జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో 2022-23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 6,86,541 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అందజేసింది. వానాకాలం సీజన్‌లో 3,86,683 మెట్రిక్‌ టన్నులు, యాసంగి సీజన్‌లో 2,99,858 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం జిల్లాలోని 160 మిల్లులకు కేటాయించింది. 2022-23 వానాకాలం సీజన్‌లో 3,86,683 మెట్రిక్‌ టన్నుల వడ్లు మిల్లులకు కేటాయించగా.. మిల్లర్లు 2,60,020 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సివిల్‌సప్లై శాఖకు అందజేయాలి. కానీ ఇప్పటివరకు 1,59,296 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,00,724 మెట్రిక్‌ టన్నులు బకాయిఉంది. యాసంగి సీజన్‌లో 2,99,858 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు కేటాయించారు. మిల్లర్లు 2,03,903 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 22,416 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. యాసంగికి సంబంధించి ఇంకా 1,81,487 మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయి ఉన్నది. సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం డిసెంబరు 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఇంకా 13 రోజులే వ్యవధి ఉండగా రెండు సీజన్లకు సంబంధించి 2,82,211 మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్లు ఇంకా ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

హెచ్చరికలను పట్టించుకోని మిల్లర్లు

మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ బియ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సత్ఫలితాల్ని ఇవ్వలేదు. పలుమార్లు గడువు విధించినా బిల్లర్లు బియ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు. దీంతో సీఎంఆర్‌ బియ్యం పెడింగ్‌లో ఉన్న మిల్లులకు ఈ వర్షాకాలం ధాన్యాన్ని కేటాయించకూడదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌ ఇటీవల ఓ రివ్యూలో అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా బియ్యం ఇవ్వని 68 రైస్‌మిల్లులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి సీఎంఆర్‌ కోటా నిలిపివేశారు. బియ్యం ఇవ్వని మిల్లర్లపై రెవెన్యూ రీకవరీ యాక్ట్‌ ప్రకారం ఆస్తులు జప్తు చేసేందుకు వెనకాడేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్‌లోని శ్రీపాద రైస్‌ ఇండ్రస్ట్రీస్‌, పెద్దచింతకుంటలోని శ్రీవేంకటేశ్వర రైస్‌మిల్‌, శివ్వంపేటలోని శ్రీలక్ష్మీనర్సింహ రైస్‌మిల్‌, నర్సాపూర్‌లోని శివసాయి రైస్‌మిల్లు, పాపన్నపేటలోని భార్గవ ఇండ్రస్ట్రీస్‌, మాసాయిపేటలోని చైతన్య రైస్‌మిల్లులను బ్లాక్‌లి్‌స్టలో పెట్టినట్లు పౌరసరఫరాలశాఖ డీఎం హరికృష్ణ తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 12:02 AM