శేఖాపూర్‌లో ‘చిరుధాన్యాల జాతర’

ABN , First Publish Date - 2023-01-25T23:47:41+05:30 IST

మండలంలోని శేఖాపూర్‌ గ్రామంలో దక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) సభ్యులు బుధవారం చిరుధాన్యాల విశిష్టతను వివరిస్తూ పాత పంటల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు.

శేఖాపూర్‌లో ‘చిరుధాన్యాల జాతర’
ఎడ్లబండి ఊరేగింపుతో పాత పంటలపై అవగాహన కల్పిస్తున్న డీడీఎస్‌ సభ్యులు

జహీరాబాద్‌ జనవరి 25: మండలంలోని శేఖాపూర్‌ గ్రామంలో దక్కన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) సభ్యులు బుధవారం చిరుధాన్యాల విశిష్టతను వివరిస్తూ పాత పంటల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సర్పంచు గడ్డమిది విజయలక్ష్మి ఎడ్లబండ్లకు పూజ చేసి బండ్ల ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం మహిళలు ఆట, పాటల ద్వారా విత్తనాలతో అలంకరించిన ఎడ్ల బండ్ల ఊరేగింపులో గ్రామ ప్రజలకు చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. పాత పంటల అవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచు విజయలక్ష్మి మాట్లాడుతూ చిరుధాన్యాల పంటలైన సజ్జలు, కొర్రలు, సామలు, జొన్నలు, మినుములు, పెసర పంటల సాగుకై కృషి చేస్తున్న డీడీఎస్‌ వారిని ఆదరించాలన్నారు. డీడీఎస్‌ మహిళాసభ్యులు మాట్లాడుతూ పాత పంటల్లో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళికి ఏర్పడుతున్న వివిధ ప్రాణాంతకమైన వ్యాధులను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే చిరుధాన్యాల భోజనం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. రైతులు చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలుసుకొని సేంద్రియ వ్యవసాయంలో భాగంగా చిరుధాన్యాలను పండించాలంటూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు తుక్కరెడ్డి, ఎంపీటీసీ నర్సింహులు, డీడీఎస్‌ ప్రతినిధులు సుక్కమ్మ, విజయలక్ష్మి, నర్సమ్మ, చంద్రమ్మ వినయ్‌కుమార్‌ బలన్న కమలమ్మ మహిళా సంఘాల సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:47:41+05:30 IST