Share News

కార్డు చూపించకపోతే చార్జీ

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:41 PM

మహిళలూ.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు సిద్ధమయ్యారా? అయితే మీవెంట ఆధార్‌ లేదా ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి. లేకపోతే టికెట్‌ డబ్బులు వసూలు చేస్తున్నారు.

కార్డు చూపించకపోతే చార్జీ

‘మహాలక్ష్మి’ పథకంపై నూతన నిబంధన

ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపుకార్డులు చూపించాల్సిందే

సోమవారం నుంచి అమలు చేస్తున్న ఆర్టీసీ

సంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 18 : మహిళలూ.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు సిద్ధమయ్యారా? అయితే మీవెంట ఆధార్‌ లేదా ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి. లేకపోతే టికెట్‌ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నెల 9న ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపకున్నా ఉచితంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించించేందుకు ఆర్టీసీ అనుమతించింది. కానీ ఇకపై మహిళలు ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఆర్టీసీ అధికారులు సోమవారం నుంచి పక్కాగా అమలు చేస్తున్నారు. గుర్తింపుకార్డు చూపిన మహిళలకు జీరో టికెట్‌ జారీ చేస్తున్నారు. గుర్తింపుకార్డు లేకున్నా, జీరో టికెట్‌ పొందకున్నా, మహిళల నుంచి రూ.500 ఫైన్‌ కూడా వసులు చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని అధికారులు తెలిపారు. కనీసం ఫోన్లో అయినా గుర్తింపు కార్డు చూయించి జీరో టికెట్‌ పొందాలని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ మార్గాల్లో ఆర్టీసీ అధికారులు కూడా తనిఖీలు ప్రారంభించారు. ‘మహాలక్ష్మీ’ పథకం అమలును కూడా పర్యవేక్షిస్తున్నారు.

సీట్లు దొరక్క ఇక్కట్లు

ఉచిత ప్రయాణంతో బస్సుల్లో అధిక శాతం మహిళలే ప్రయాణించడంతో మగవాళ్లకు సీట్లు దొరకడం లేదు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. సీట్లల్లో మహిళలే కూర్చోవడం కనిపిస్తున్నది. ప్రతీ బస్సులో 60-80 శాతం మహిళలే ఎక్కడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. దీంతో కొందరు పురుషులు కర్ణాటక, మహారాష్ట్ర బస్సులను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:41 PM