ఓవైపు సంబరాలు.. మరోవైపు అసమ్మతి

ABN , First Publish Date - 2023-08-22T01:16:13+05:30 IST

టికెట్‌పై అధినేత ప్రకటన వెలువడగానే మెదక్‌ నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి నేతలు దూకుడు పెంచారు.

ఓవైపు సంబరాలు.. మరోవైపు అసమ్మతి

మెదక్‌ మున్సిపాలిటీ, ఆగస్టు 21: టికెట్‌పై అధినేత ప్రకటన వెలువడగానే మెదక్‌ నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో అసమ్మతి నేతలు దూకుడు పెంచారు. పద్మాదేవేందర్‌రెడ్డికే మరోసారి టికెట్‌ ఇస్తున్నట్టు అధినేత ప్రకటించగా ఆమె అనుచరలు జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి వర్గం, మైనంపల్లి రోహిత్‌ వర్గం నేతలు ఒక్కటై ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించిన కొద్దిసేపటికే మెదక్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో అసమ్మతి నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. రెండుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డి స్థానిక నాయకులను, కార్యకర్తలను పట్టించుకోలేదని, అహంకార ధోరణి ప్రదర్శించారని ఆరోపించారు. ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డి ప్రతీ పనిలోనూ కమీషన్‌ తీసుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులపై తమకెంతో గౌరవమని.. అభ్యర్థిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని.. పార్టీ విధానాలను కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి లేదా మైనంపల్లి రోహిత్‌కు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ టికెట్‌ను పద్మాదేవేందర్‌రెడ్డికి కాకుండా ఎవరికి ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు సిద్ధు, సిబితాశ్రీకాంత్‌, రామాయంపేట ఏఎంసీ మాజీ చైర్మన్‌ గంగాధర్‌, పాపన్నపేట మండల నాయకుడు గంగాధర్‌, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌గుప్త, అంజాగౌడ్‌, ఎస్‌డీ కృష్ణ, మహేందర్‌రెడ్డి, మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ నాయకులు బొజ్జ పవన్‌, పరశురాంగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:16:13+05:30 IST