Share News

ఇద్దరు కేబినెట్‌లోకి..

ABN , First Publish Date - 2023-12-07T23:56:34+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి అందోలు ఎమ్మెల్యే సిలారపు దామోదర్‌ రాజనర్సింహకు మరోసారి మంత్రి యోగం దక్కింది. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ బీసీ కోటాలో అమాత్య పదవి వరించింది.

ఇద్దరు కేబినెట్‌లోకి..
ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దామోదర్‌ రాజనర్సింహ

- అందోలు ఎమ్మెల్యే దామోదర్‌ రాజనర్సింహకు వైద్య ఆరోగ్య శాఖ

- కాంగ్రెస్‌ నాలుగో కేబినెట్‌లోనూ కీలక బెర్త్‌

- ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ప్రమాణస్వీకారం

- హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు బీసీ సంక్షేమ శాఖ

- మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న పొన్నం

- హుస్నాబాద్‌ నియోజవర్గానికి తొలిసారి మంత్రి హోదా

ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి అందోలు ఎమ్మెల్యే సిలారపు దామోదర్‌ రాజనర్సింహకు మరోసారి మంత్రి యోగం దక్కింది. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ బీసీ కోటాలో అమాత్య పదవి వరించింది. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా దామోదర్‌, పొన్నం ప్రభాకర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దామోదర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, పొన్నంకు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు.

దామోదర్‌ ప్రమాణ స్వీకారం

జోగిపేట, డిసెంబరు7: అందోలు ఎమ్మెల్యే సిలారపు దామోదర్‌ రాజనర్సింహ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. 2004 నుంచి నేటి వరకూ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన నాలుగు కేబినెట్లలోనూ దామోదర్‌కు మంత్రి పదవి దక్కగా, ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏకైక ప్రతినిధి కావడం విశేషం.

దామోదర్‌ రాజనర్సింహ తండ్రి రాజనర్సింహ రాజకీయవారసుడిగా 1989లో అందోలు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అరంగేట్రం చేసి గెలిచారు. గెలిచిన రెండున్నరేళ్ల తర్వాత దామోదర్‌ను ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. ఆతర్వాత 1994 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 1997లో అందోలు స్థానానికి జరిగిన ఉపఎన్నికతో పాటు, ఆతర్వాత 1999లో జరగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ దామోదర ఓటమి పాలయ్యారు. 2004లో ఘనవిజయం సాధించారు. గెలిచిన తర్వాత రెండున్నరేళ్లకి వైఎ్‌సఆర్‌ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. అప్పుడు ఏర్పాటైన వైఎ్‌సఆర్‌ మలివిడత కేబినెట్‌లో తిరిగి స్థానం సంపాదించారు. రెండోసారి మంత్రిగా మార్కెటింగ్‌ శాఖను నిర్వహించారు. అనంతరం వైఎ్‌సఆర్‌ మరణం తర్వాత ఏర్పడిన రోశయ్య కేబినెట్లోనూ దామోదర్‌కు ఉన్నత విద్య శాఖ మంత్రిగా చోటు లభించింది. ఆ తర్వాత ఏర్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనూ దామోదర్‌కు ఉన్నత విద్యశాఖ దక్కింది. దీంతో పాటుగా రాష్ట్రంలోని బలమైన మాదిగ సామాజిక వర్గ నేత కావడం, తెలంగాణ ప్రాంత సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కావడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదే కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో ఉన్నత విద్యశాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆసమయంలో దామోదర ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టబద్దత కోసం పోరాడి సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేబినెట్‌లోని తెలంగాణ ప్రాంత సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన దామోదర్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంలోనూ తనదైన కృషి చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014, 2018 ఎన్నికల్లో దామోదర్‌ ఓటమి చవిచూశారు. ఈసారి దామోదర్‌ విజయఢంకా మోగించడం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో పార్టీ సీనియర్‌ నాయకుడిగా కేబినెట్‌లో స్థానం పొందారు. దామోదర్‌ 2004 ఎన్నికల నుంచి నేటి వరకూ వరుసగా కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన నాలుగు మంత్రి వర్గాల్లోనూ బెర్తు లభించడ గమనార్హం. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆ పదవి తిరిగి దక్కుతుందని భావించినప్పటికీ అధిష్ఠానం దామోదర్‌ను మంత్రిగానే కొనసాగించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిన విద్య, వైద్య, ఆరోగ్యం, ఉద్యోగం అనే విషయాల్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ దక్కడం విశేషం.

సిలారపు దామోదర్‌ రాజనర్సింహ

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

పుట్టిన తేదీ : 1958 డిసెంబరు 5

కులం : ఎస్సీ (మాదిగ)

విద్యార్హతలు : బీఈ సివిల్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం

తల్లీతండ్రి : సిలారపు రాజనర్సింహ, జానాబాయి

భార్య : పద్మినీరెడ్డి, కుమార్తె : త్రిష

రాజకీయ పదవులు

- 1989లో అందోలు ఎమ్మెల్యేగా ఎన్నిక

- 1991లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌

- 2004 వైఎ్‌సఆర్‌ కేబినెట్‌లో ప్రాథమిక విద్యా శాఖ మంత్రి

- 2009 వైఎ్‌సఆర్‌ మలి విడత ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రి

- 2009లో కొణిజేటి రోశయ్య కేబినెట్‌లో ఉన్నత విద్య శాఖ మంత్రి

- 2010 ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యతోపాటు ఉప ముఖ్యమంత్రి

- రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అను నేను

హుస్నాబాద్‌, డిసెంబరు 7 : హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొన్నంకు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టిన ఆయనకు మంత్రి పదవి వరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఏడు దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారి హుస్నాబాద్‌ నియోజకవర్గానికి పొన్నం రూపంలో మంత్రివర్గంలో చోటు లభించింది.

ఒడిదుడుకుల ప్రయాణం

పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1987 నుంచి 1988 వరకు కరీంనగర్‌ ప్రభుత్వ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల స్టూడెంట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎ్‌సయూఐలో అంచెలంచెలుగా ఎదిగారు. 1992 నుంచి 1998 వరకు ఎన్‌ఎ్‌సయూఐ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1999 నుంచి 2002 వరకు ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఎ్‌సయూఐ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2005 నుంచి 2009 వరకు ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు కరీంనగర్‌ ఎంపీగా, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

మూడో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలుపు

ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రె్‌సను వీడకుండా పార్టీని నమ్ముకోవడం వల్లే ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ సన్నిహితులు పేర్కొంటున్నారు. కరీంనగర్‌ ఎంపీగా పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సందర్భంగా లగడపాటి రాజగోపాల్‌ జరిపిన పెప్పర్‌ స్ర్పే దాడిలో అనారోగ్యం పాలై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పొన్నం ప్రభాకర్‌ 2004లో కరీంనగర్‌ నుంచి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014లో కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసి పరాజయం పొం దారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చెందారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓటమిచెంది మూడవసారి హుస్నాబాద్‌ నుంచి విజయం సాధించి మంత్రిగా కావడం విశేషం.

కలిసివచ్చిన హుస్నాబాద్‌.. కేసీఆర్‌ సెంటిమెంట్‌కు దెబ్బ

పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు హుస్నాబాద్‌కు కలిసివచ్చింది. కరీంనగర్‌ ఎంపీగా పని చేసిన నుంచి ఆయనకు హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. గౌడ సామాజికవర్గంతో పాటు బీసీలు అధికంగా ఉన్న హుస్నాబాద్‌ నుంచి పోటీ చేయాలని సంకల్పించుకొని ఆగస్టు 24వ తేదీన ఇక్కడి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. తనతో పాటు కుటుంబం ఓట్లను కూడా ఇక్కడికే మార్చారు. హుస్నాబాద్‌లో స్థలం కూడ కొనుగోలు చేశారు. కుటుంబంతో ఇక్కడే ఉంటూ స్థానికేతరుడనే ముద్రను తొలగించుకున్నారు.అధిష్ఠానం అండతో టికెట్‌ సాధించడంలో సఫలికృతులయ్యారు. అప్పటి నుంచి పార్టీలో అసంతృప్తులు లేకుండా చేసుకోవడంతో పాటు మిత్రపక్షమైన సీపీఐ ఓట్లు చీలకుండా పూర్తి మద్దతు కూడగట్టారు. ఎదుటి వారిని మెప్పించే వాగ్దాటి, రాజకీయ చతురత, ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను కూడగట్టుకొని నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. కేసీఆర్‌ ప్రచారం ప్రారంభానికి సెంటిమెంట్‌గా భావించే హుస్నాబాద్‌లో బీఆర్‌ఎ్‌సను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత నుస్తులాపూర్‌ నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం అనంతరం ఇందుర్తిగా ఆవిర్భవించింది. 2009లో హుస్నాబాద్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. నాటి నుంచి ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. పొన్నంకు దక్కడంతో ఇన్నాళ్లకు ఆలోటు తీరింది. వెనుకబాటుకు గురైన హుస్నాబాద్‌ ఇక అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల పనులు పూర్తై మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌కు సాగునీరు అందుతుందని ఆశిస్తున్నారు.

పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

బీసీ సంక్షేమ శాఖ మంత్రి

పుట్టిన తేదీ : 1967 మే 8

కులం : బీసీ-బీ (గౌడ)

విద్యార్హతలు : ఎంఏ(పొలిటికల్‌ సైన్స్‌), ఉస్మానియా యూనివర్సిటీ

ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీ

తండ్రి స్వర్గీయ పొన్నం సత్తయ్యగౌడ్‌, తల్లి మల్లమ్మ

భార్య మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్‌

రాజకీయ పదవులు

- 1987లో కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టూడెంట్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌

- 1992లో ఎన్‌ఎ్‌సయూఐ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర కార్యదర్శి

- 1999లో ఏపీ ఎన్‌ఎ్‌సయూఐ ప్రెసిడెంట్‌

- 2005లో ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌

- 2009లో కరీంనగర్‌ ఎంపీ, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌

- టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Updated Date - 2023-12-07T23:56:37+05:30 IST