సమస్యలను పరిష్కరించాలంటూ జాతీయ రహదారి దిగ్బంధం

ABN , First Publish Date - 2023-02-06T23:19:26+05:30 IST

టోల్‌గేట్‌ వద్ద స్థానికులకు ఫ్రీ పాసులను అందజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161జాతీయ రహదారిని దిగ్బంధించారు.

సమస్యలను పరిష్కరించాలంటూ జాతీయ రహదారి దిగ్బంధం
జాతీయ రహదారిపై బైఠాయించిన వివిధ పార్టీల నాయకులు, ప్రజలు

సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా రహదారిపై స్తంభించిన వాహనాల రాకపోకలు

రెండు గంటలు బైఠాయించిన ఆందోళనకారులు

భారీగా పోలీసుల మోహరింపు

ఫ్రీ పాస్‌ల అంశాన్ని పరిశీలిస్తామన్న టోల్‌గేట్‌ యాజమాన్యం

పుల్‌కల్‌, ఫిబ్రవరి 6: టోల్‌గేట్‌ వద్ద స్థానికులకు ఫ్రీ పాసులను అందజేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద సంగారెడ్డి-నాందేడ్‌, అకోలా 161జాతీయ రహదారిని దిగ్బంధించారు. పుల్కల్‌, చౌటకూర్‌ మండలాలకు చెందిన చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సోమవారం మూకుమ్మడిగా తరలివచ్చి 2 గంటల పాటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ వసూల్‌ కేంద్రం వద్ద ఇరు మండలాలకు చెందిన స్థానికులకు ఫ్రీపాసులు అందజేయాలని, అంతే కాకుండా తాడ్దానిపల్లి చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ లేదా యూటర్న్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. జాతీయ రహదారి నాలుగు లైన్లుగా విస్తరించినప్పటికీ, సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయకుండా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు రహదారిని డిజైన్‌ చేయడంతో తాము అవస్థలు పడుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనకారులు ఉదయం 9గంటలకే తాడ్దానిపల్లి చౌరస్తా వద్దకు చేరుకోవడంతో జాతీయ రహదారి జనంతో కిటకిటలాడింది. నిరసనకారులు రహదారిపై ఇరువైపులా ఆందోళనకు దిగి రెండు గంటలు బైఠాయించడంతో కిలో మీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. జోగిపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఏఆర్‌ పోలీస్‌ బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఎంతగా సముదాయించినప్పటికీ వారు ఆందోళనను విరమించలేదు. నిర్దిష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ భీష్మించుకున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో అంబులెన్సులు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆందోళనకారులు ప్పటికప్పుడే తమ వెంట తెచ్చుకున్న ఎక్స్‌కవేటర్‌తో చౌరస్తా వద్ద రోడ్డును తవ్వేందుకు యత్నించారు. పోలీసులు కల్పించుకొని ఆందోళనకారులను నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు.

దిగివచ్చిన టోల్‌ప్లాజా యాజమాన్యం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైవే యాజమాన్యం, టోల్‌ప్లాజా యాజమాన్యం దిగివచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ప్రజలు తమ డిమాండ్లను వారి ముందుంచారు. తమ పరిధిలో 20కిలో మీటర్ల వరకు తమ వాహనాలకు ఫ్రీ పాసులు ఇవ్వాలని, అలాగే సుల్తాన్‌పూర్‌, తాడ్దానిపల్లి, హున్నాపూర్‌ గ్రామాల వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలు, సుల్తాన్‌పూర్‌ నుంచి శివ్వంపేట వరకు సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి సమస్యలను విన్న అధికారులు ఇప్పుటికప్పుడు అవి సాధ్యం కావని, వారం రోజులు గడువిస్తే ఢిల్లీలోని జాతీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆందోళనకారులు నినాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా తరలించేందుకు యత్నించగా వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ రవీందర్‌రెడ్డి సముదాయించేందుకు యత్నించినా వినకపోవడం తో ఆందోళనకారులను బలవంతంగా పక్కకు తప్పించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఆందోళనలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పల్లె సంజీవయ్య, భజరంగ్‌దళ్‌ రాష్ట్ర నాయకుడు సుభా్‌షచందర్‌, రైతుబంధు అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఆత్మ చైర్మన్‌ యాదగిరిరెడ్డి, బీజేపీ నాయకుడు పార్కుల రామ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు బాలాగౌడ్‌, సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:19:28+05:30 IST