బీజేపీ టికెట్ 4 కోట్లకు అమ్ముకున్నరు
ABN , First Publish Date - 2023-11-10T23:31:02+05:30 IST
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే శుక్రవారం జిల్లాకేంద్రంలో హల్‌చల్ చేశారు. సంగారెడ్డిలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఫైర్ అయ్యారు.
బీ-ఫారమ్ ఇస్తాం నామినేషన్ వేసుకోమని.. ఇజ్జత్ తీస్తరా?
సంగారెడ్డిలో దేశ్‌పాండే మండిపాటు
చివరి క్షణంలో బీ-ఫారమ్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం
ఫోన్‌లోనే కిషన్‌రెడ్డిపై ఫైర్
కుటుంబ సభ్యులతో సహా ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరిక
సంగారెడ్డి అర్బన్, నవంబరు 10 : సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే శుక్రవారం జిల్లాకేంద్రంలో హల్‌చల్ చేశారు. సంగారెడ్డిలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి ఫైర్ అయ్యారు. బీ-ఫారమ్ ఇస్తాను రమ్మని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. నామినేషన్ వేసుకో బీ-ఫామ్ పంపిస్తామని చెప్పి మరొకరికి ఎలా ఇచ్చారని నిలదీశారు. నియోజకవర్గంలో తన ఇజ్జత్ తీశారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకుంటానని, కిషన్‌రెడ్డికే ఆ ఉసురు తగులుతుందని హెచ్చరించారు. దేశ్‌పాండేకు బీ-ఫారమ్ ఇవ్వకపోవడంతో దేశ్‌పాండే వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు కారు అద్దాలు ద్వంసం చేశారు. పలువురు నాయకులపై దాడికి పాల్పడారు. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, నరేందర్‌రెడ్డి ఫ్లెక్సీలు చించేసి, దిష్టిబొమ్మలను దహనం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.
టికెట్ అమ్ముకున్నారు
బీజేపీ బీ-ఫారమ్ ఇవ్వకపోవడంతో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు సంగారెడ్డి బీ-ఫామ్‌ను నాలుగు కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. బీ-ఫామ్ ఇవ్వకుండా పరువు తీసిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లుగా పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేస్తూ వస్తూంటే మీరిచ్చిన గౌరవం ఇదా అని ప్రశ్నించారు. బీ-ఫారమ్ ఇంకొకరి ఇస్తున్నామని సూటిగా చెప్తే ఊరుకునే వాళ్లమని, కానీ ఇస్తామని రమ్మని పిలిచి ఈ విధంగా అవమానపర్చడం రాష్ట్ర నాయకత్వానికి తగదన్నారు. వారికి గుణపాఠం చెప్పేలా కాషాయ జెండాతోనే ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. తనకు టికెట్ రాకుండా అమ్ముకున్నవారు ఏవిధంగా రాజకీయాలు చేస్తారో చూస్తానని హెచ్చరించారు.