ఆత్మకూర్‌ అడ్డాగా ఆరేళ్లుగా నకిలీ విత్తన దందా

ABN , First Publish Date - 2023-05-31T23:52:20+05:30 IST

మోసపోయిన రైతు ఫిర్యాదుతో వెలుగులోకి తనిఖీల్లో రూ.2.80 కోట్ల విలువైన విత్తనాలు, పురుగు మందుల సీజ్‌

 ఆత్మకూర్‌ అడ్డాగా ఆరేళ్లుగా నకిలీ విత్తన దందా
ఉదయ్‌కుమార్‌ జైన్‌ గోదాంలో నిల్వ ఉంచిన నకిలీ పురుగుమందులు, విత్తనాలు, ఎరువులు

సదాశివపేట రూరల్‌, మే 30: నకిలీ పురుగుమందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ.కోట్లు విలువైన దందాను కొనసాగిస్తున్నారు. పది రోజుల క్రితం అధికారుల తనిఖీల్లో రూ.కోట్లు విలువైన నకిలీ విత్తనాలు, పురుగు మందులు పట్టబడడమే ఇందుకు నిదర్శనం. సదాశివపేట మండలం ఆత్మకూర్‌లో నివాసముంటున్న ఉదయ్‌కుమార్‌ జైన్‌ ఆరు సంవత్సరాలుగా అలామా ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన రైతు నీరడి నగేష్‌ అతడి వద్ద నాలుగు ఎకరాలకు సరిపడా పత్తి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేశారు. అవన్నీ నకిలీవి కావడంతో మొత్తం పంట నష్టపోయాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఉదయ్‌కుమార్‌ జైన్‌ను నిలదీయగా రూ.లక్ష ఇచ్చేందుకు అంగీకరించి ఆ తరువాత మొహం చాటేశాడు. రైతు నగేష్‌, గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మకూర్‌లో జరుగుతున్న నకిలీ దందా బయటపడింది. పోలీసులు, వ్యవసాయ అధికారులు మే 18, 19 తేదీల్లో వరుస దాడులు నిర్వహించగా ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు నాలుగు భారీ గోదాముల్లో నిల్వ చేసిన నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2.82 కోట్లుగా లెక్కగట్టారు.

వ్యవసాయక్షేత్రంలో నకిలీ పురుగుమందుల ఉత్పత్తి

సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామ శివారులోని ఉదయ్‌కుమార్‌ వ్యవసాయ క్షేత్రంలో నకిలీ పురుగుమందులు తయారు చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ నెల 26న జిల్లా ఆహార భద్రతా అధికారి ధర్మేందర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 33 రకాల కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌, చాక్లెట్స్‌, బిస్కెట్స్‌, పాలు, పలు రోగాలకు వైద్యులు అందించే మందు గోలీలు, బేకరీ ఐటమ్స్‌తో నకిలీ పురుగుమందులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు.

ఆరేళ్లుగా పట్టించుకోనే లేదు

ఆత్మకూర్‌ గ్రామం కేంద్రంగా ఆరు సంవత్సరాలుగా నకిలీ పురుగుమందులు, విత్తనాలు, ఎరువులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్టు నకిలీ దందా చేస్తున్న వ్యాపారిపై పీడీయాక్టు ఎందుకు నమోదు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్‌కుమార్‌జైన్‌పై పోలీసులు 420, 6(ఏ), క్లాజ్‌ 3(1)ఏ, నకిలీ విత్తన నియంత్రణ చట్టం 1983 సెక్షన్‌ 29, 188 ఐపీసీ, పురుగుమందుల చట్టం 1968 సెక్షన్‌ 7, ఈసీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కానీ నకిలీ వ్యాపారిపై పీడీయాక్టు నమోదు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-05-31T23:52:20+05:30 IST