సిద్దిపేట జిల్లాలో అతలాకుతలం

ABN , First Publish Date - 2023-03-20T00:14:06+05:30 IST

శనివారం రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, వరి చేన్లు నేలవాలాయి. టమాట, పొద్దుతిరుగుడు, పచ్చిమిర్చి తోటలు దెబ్బతిన్నాయి.

సిద్దిపేట జిల్లాలో అతలాకుతలం
కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో దెబ్బతిన్న పొద్దుతిరుగుడు పంట

అకాల వర్షంతో అన్నదాతకు నష్టం

సుమారు 2 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

నేలరాలిన మామిడి కాయలు

పిడుగుపాటుకు ఆరు గేదెలు మృతి

జిల్లా వ్యాప్తంగా 38 మిల్లీమీటర్ల వర్షపాతం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 19 : అకాలవర్షంతో జిల్లాలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, వరి చేన్లు నేలవాలాయి. టమాట, పొద్దుతిరుగుడు, పచ్చిమిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. వ్యవసాయ అధికారుల సర్వేలో సుమారుగా 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. పిడుగుపాటుకు ఆయా గ్రామాల్లో మూడు గేదెలు, మూడు లేగదూడలు మృత్యువాత పడ్డాయి.

ఐదు మండలాల్లో 60 మిల్లీమీటర్ల చొప్పున

తుఫాన్‌ ప్రభావం జిల్లాకు సైతం పొంచి ఉండడంతో గత మూడు రోజులుగా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూనే ఉన్నది. శుక్రవారం చిరుజల్లులు కురవగా శనివారం ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి 38.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీవో కార్యాలయం ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా చిన్నకోడూరు, కోహెడ, హుస్నాబాద్‌, సిద్దిపేట అర్బన్‌, తొగుట మండలాల్లో 60 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదవగా, మిగతా అన్ని మండలాల్లోనూ 20 మిల్లీమీటర్లకు మించి నమోదైంది. వర్గల్‌ మండలంలో అత్యల్పంగా 2.4మి.మీ.ల వర్షపాతం ఉంది.

మొక్కజొన్నకు తీవ్ర నష్టం

అకాల వర్షానికి జిల్లా వ్యాప్తంగా 2వేల ఎకరాలకు పైగానే నష్టం వాటిల్లింది. శనివారం ఆయా మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నంగునూరు, బెజ్జంకి, తొగుట, కోహెడ, జగదేవ్‌పూర్‌, చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్‌, హుస్నాబాద్‌ మండలాల్లో నష్టం జరిగినట్లు నివేదిక రూపొందించారు. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1520 ఎకరాల్లో మొక్కజొన్న, 103 ఎకరాల్లో పొద్దు తిరుగుడు, 143 ఎకరాల్లో వరి పంటలు నేలవాలాయి. 682 మంది రైతులకు నష్టం కలిగినట్లుగా తేల్చారు. అదే విధంగా ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. టమాట, మిర్చీ, ఇతర కూరగాయల తోటలూ దెబ్బతిన్నాయి.

పిడుగులు, వడగళ్లతో బెంబేలు

శనివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలు బెంబేలెత్తించాయి. చిన్నకోడూరులో వడగండ్ల వర్షం కురిసింది. చిన్నపాటి రాళ్లు పడ్డాయి. అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామంలో చిర్రం జంగయ్యకు చెందిన 2 పాడిగేదెలు మృతి చెందగా దూళిమిట్ట మండల కేంద్రంలోని దుబ్బుడు శ్రీనివా్‌సరెడ్డికి చెందిన పాడి గేదె చనిపోయింది. కొండపాక మండలం దుద్దెడలో వెంకటమ్మకు సంబంధించిన మూడు లేగదూడలు మృత్యువాత పడ్డాయి. కాగా అకాల వర్షంతో తలెత్తిన నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు.

Updated Date - 2023-03-20T00:14:06+05:30 IST