యూరియా కోసం అరిగోస

ABN , First Publish Date - 2023-09-22T00:35:59+05:30 IST

యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అరకొరగా యూరియా సరఫరా చేయడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు

యూరియా కోసం అరిగోస

సహకార సంఘాల్లో వేధిస్తున్న యూరియా కొరత

ప్రైవేట్‌ డీలర్లను ఆశ్రయిస్తున్న రైతులు

గుళికలు, కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తున్న డీలర్లు

ఒక్కో బస్తా రూ.350 చొప్పున విక్రయం

చర్యలు తీసుకోని వ్యవసాయశాఖ అధికారులు!

అక్కన్నపేట, సెప్టెంబరు 21 : యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అరకొరగా యూరియా సరఫరా చేయడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలస్యం చేస్తే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ప్రైవేట్‌ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న డీలర్లు కాంప్లెక్స్‌ ఎరువులు, గుళికలు కొంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక రైతులు కూడా వారివైపే మొగ్గుచూపుతున్నారు. డీలర్లు కూడా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. సహకార సంఘాలకు సరిపడా యూరియాను సరఫరా చేయడం లేదని, ఆగ్రో్‌సకు వచ్చిన యూరియా బస్తాలను సైతం ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదన్న ఆరోపిస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో 5.70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 3.52 లక్షల ఎకరాల్లో వరి, 1.08 లక్షల ఎకరాల్లో పత్తి, 30వేల ఎకరాల్లో మొక్కజొన్న, 8వేల ఎకరాల్లో ఇతర పంటలు, కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. ఏపుగా పెరిగిన కలుపును తీసిన రైతులు ఇప్పుడు యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే యూరియా కొనాలంటే జింక్‌, దుబ్బ గుళికలు, పొటాస్‌ తదితర కాంప్లెక్స్‌ ఎరువులు కొనాల్సిందేనని లింకులు పెట్టి ఫర్టిలైజర్స్‌ యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం యూరియా ధర రూ.266 ఉండగా ప్రైవేట్‌ డీలర్లు రూ.350 చొప్పున అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో అయితే అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు ఫర్టిలైజర్స్‌ దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులు పట్టించుకోవడం లేదు

- పీ.శ్రీనివాస్‌రెడ్డి, రైతు, గోవర్ధనగిరి, అక్కన్నపేట

ఐదెకరాల్లో వరి సాగుచేశా. కలుపు తీసి యూరియా వేద్దామంటే బస్తాలు దొరకడం లేదు. ఫర్టిలైజర్స్‌ దుకాణాలతో పాటు ఆగ్రో్‌సకు వెళితే గుళికలు, కాంప్లెక్స్‌ ఎరువులకు లింకు పెడుతున్నారు. ఇక ఒక్కో బస్తా రూ.350 చొప్పున అమ్ముతున్నారు. అయినా కూడా అధికారులు ఆయా దుకాణాల్లో తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.

అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం

- మహే్‌ష, డివిజన్‌ వ్యవసాయాధికారి, హుస్నాబాద్‌

లైసెన్స్‌ షాపుల యజమానులు యూరియాను బ్లాక్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తే షాపుల లైసెన్స్‌ రద్దు చేస్తాం. ప్రైవేట్‌ డీలర్ల కంటే ఎక్కువగా సహకార సంఘాలకు యూరియాను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. యూరియా కొరత ఉన్న మాట వాస్తవం.

Updated Date - 2023-09-22T00:35:59+05:30 IST