ఖదీర్ ఖాన్ మృతిపై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2023-02-21T00:33:56+05:30 IST
ఖదీర్‌ఖాన్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 20: ఖదీర్‌ఖాన్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఖదీర్‌ఖాన్ భార్య సిద్ధేశ్వరి, పిల్లలను సోమవారం ఆయన పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతోనే ఖదీర్ కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. పోలీసు కారణంగా మృతుడి భార్య, పిల్లలు రోడ్డున పడ్డారని వాపోయారు. ఘటనతో సంబంధం ఉన్న పోలీసులపై హత్య కేసు నమోదుచేసి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం, భార్యకు ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. ఆయనవెంట పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి, శ్రీనివాస్ ఉన్నారు.
రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఖదీర్‌ఖాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బహుజనముక్తి పార్టీ, దళిత బహుజన ఫ్రంట్, లంబాడా హక్కుల పోరాట సమితి, జాతీయ మాలమహనాడు డిమాండ్ చేశాయి. బీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు అంసోల్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అన్సారీ, ప్రకాశ్‌రాథోడ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ ఖదీర్‌ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఫ్రైండ్లీ పోలీసింగ్ అంటే కరుడుగట్టిన నేరస్తులను వదిలేసి దళిత, గిరిజన మైనార్టీ వర్గాల లాక్‌పడెత్‌లేనా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే, ఖదీర్‌ఖాన్ భార్య సిద్ధేశ్వరిని చిన్నశంకరంపేట ఎంపీపీ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ నేతలతో కలిసి పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు.