నిధులు మంజూరైనా పునరుద్ధరణకు నోచుకోని పురాతన జైన ఆలయం

ABN , First Publish Date - 2023-03-25T23:39:37+05:30 IST

దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలోని చారిత్రాత్మకమైన జైన ఆలయం ఒకప్పుడు ఆధ్యాత్మికతతో అలరారింది.

నిధులు మంజూరైనా పునరుద్ధరణకు నోచుకోని పురాతన జైన ఆలయం
బైరాన్‌పల్లిలో జైన ఆలయం

మద్దూరు, మార్చి 25: దూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలోని చారిత్రాత్మకమైన జైన ఆలయం ఒకప్పుడు ఆధ్యాత్మికతతో అలరారింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పురావస్తు శాఖాధికారులు ఎనిమిదేళ్ల క్రితం గుర్తించి అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదిక అందించారు. మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణకు రూ.22 లక్షల నిధులు మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ ఈ ఆలయంపై నిర్లక్ష్యం నీడలు కొనసాగుతూనే ఉన్నాయి. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆలయంలోని ప్రతీ రాతి స్తంభానికి మార్కింగ్‌ వేసి ఆలయం చుట్టూరా తవ్వకాలు ప్రారంభించి పనులు చేపట్టకుండానే, నిధులు సరిపోవంటూ అర్ధంతరంగా వదిలేసి వెళ్లిపోయాడు. నాటి నుంచి ఆలయం పునరుద్ధరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. దాదాపు 3 దశాబ్దాల క్రితం గ్రామానికి చెందిన అప్పటి సర్పంచ్‌ జగ్గని లింగం అంగడి వీరభద్రస్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా జైన ఆలయం అంగడి వీరభద్రస్వామి ఆలయంగా గుర్తింపు పొందింది, గ్రామస్థులు ఏటా శివరాత్రినాడు ఈ ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శనతో పాటు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం నుంచి బెక్కల్‌ రామలింగేశ్వరస్వామి ఆలయానికి న్యాలబొయ్యారం(సొరంగ మార్గం)ఉన్నట్లు ప్రచారంలో ఉంది. పునరుద్దరణ పనులను అర్ధంతరంగా వదిలి వెళ్లిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ తర్వాత పనులు కొనసాగుతున్నాయా లేవా అని ప్రభుత్వ అధికారులు గానీ ఇటు పురావస్తుశాఖాధికారులు తొంగిచూసిన పాపాన పోలేదు. ఫలితంగా జైన దేవాలయం జీర్ణోద్దరణకు నోచుకోకుండా పోయింది. ఇప్పటికైనా టెండర్‌ పనులు మరో కాంట్రాక్టర్‌కు అప్పగించి జైన ఆలయం పునరుద్ధరణకు పాటుపడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2023-03-25T23:39:37+05:30 IST