Share News

అమాత్యునికి సమస్యల స్వాగతం

ABN , First Publish Date - 2023-12-10T23:56:20+05:30 IST

71 ఏళ్ల కాలంలో మొదటిసారి హుస్నాబాద్‌కు మంత్రి పదవి వరించడంతో ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.

అమాత్యునికి సమస్యల స్వాగతం

గౌరవెల్లి ద్వారా నీటి సరఫరా.. గండిపల్లి రిజర్వాయర్ల పూర్తి

ప్రియాంక గాంధీ మెడికల్‌ కాలేజీ హామీ అమలు

సర్వాయి పాపన్న కోట, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ

హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపో అభివృద్ధిపై ఆశలు

నేడు హుస్నాబాద్‌కు వస్తున్న

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌, డిసెంబరు 10 : 71 ఏళ్ల కాలంలో మొదటిసారి హుస్నాబాద్‌కు మంత్రి పదవి వరించడంతో ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులైన పొన్నం ప్రభాకర్‌ తొలిసారిగా సోమవారం హుస్నాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆయనకు ఈ ప్రాంత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వాటిని ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

గౌరవెల్లి, గండిపల్లి ..

దాదాపుగా పూర్తయిన గౌరవెల్లి రిజర్వాయర్‌పై ఉన్న కేసులను పరిష్కరించి నియోజవర్గంలోని 1.6 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని రైతాంగం కోరుతుంది. ప్రధానంగా రిజర్వాయర్‌ నుంచి కాలువలను నిర్మాణం చేయడమే కాకుండా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీరందించే 40 శాతం పూర్తయిన గండిపల్లి రిజర్వాయర్‌ను 100శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్‌, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సాగు నీటిని అందించేంకు కాలువలను క్రమబద్దీకరించాలని కోరారు.

మెడికల్‌ కాలేజీ హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల హుస్నాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి ప్రియాంక గాంధీ కాంగ్రె్‌సను గెలిపిస్తే మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించినందుకు మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరుతున్నారు. అలాగే హుస్నాబాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను బీటెక్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయడమే కాకుండా విద్యార్థులకు అక్కడే హాస్టల్‌ నిర్మాణం చేయాలని కోరుతున్నారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌లో సబ్‌ కోర్టు ఏర్పాటు చేయాలి. కోహెడలో డిగ్రీ కళాశాల, ఇతర ఉన్నత విద్యా కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పొన్నం ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

కొత్తపల్లి నుంచి జనగామకు హైవే

కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి కొత్తపల్లి నుంచి చిగురుమామిడి, హుస్నాబాద్‌ మీదుగా జనగామ వరకు హైవే నిర్మాణం చేపట్టాలి. అటు వేములవాడ రాజన్న ఆలయం, ఇటు యాదగిరి నరసింహస్వామి ఆలయం మధ్య రవాణా మార్గం మెరుగవుతుంది. అలాగే అత్యధికంగా గిరిజనులున్న హుస్నాబాద్‌ ఏరియాలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది.

హుస్నాబాద్‌ డిపో అభివృద్ధి

పొన్నం ప్రభాకర్‌ రవాణా శాఖ మంత్రి కావడంతో హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. కరీంనగర్‌ రీజియన్‌లో ఉన్న ఈ డిపో ప్రస్తుతం నష్టాల్లో నడుస్తుంది. అరకొర బస్సులు, కాలం చెల్లిన బస్సులతో నడిపిస్తున్నారు. హుస్నాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు బస్సులు సర్వీసు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడంతో డిపో అభివృద్ధి చెందలేదు. ఒకనాడు ఇక్కడి నుంచి భీమండి, భద్రాచలం, విజయవాడ, నిజామాబాద్‌ వంటి పట్టణాలకు బస్సులు నడిపినా క్రమేణా వాటిని రద్దు చేశారు. ఈ డిపోకు ఆదాయం రావాలంటే ప్రధానంగా సిద్దిపేట, హన్మకొండ రూట్లను హుస్నాబాద్‌ డిపోకు కేటాయించాలి. కరీంనగర్‌, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, ఖమ్మం వంటి డిపోల నుంచి హుస్నాబాద్‌ మీదుగా దూర ప్రాంతాలకు బస్సులు నడిపిస్తే రవాణాపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. హుస్నాబాద్‌ నుంచి జనగామ, సూర్యపేట మీదుగా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిపించే అవకాశం ఉంది.

పర్యాటక కేంద్రాలుగా సర్వాయి పాపన్నకోట

నియోజకవర్గంలోని సైదాపూర్‌ మండలంలోని సర్వాయి పాపన్న కోటతో పాటు హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మ చెరువు, మహాసముద్రం గండి, రాయికల్‌ జలపాతం, శనిగరం ప్రాజెక్టు, కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌ను సుందరీకరణ పనులు చేపట్టాలి. చౌరస్తాలను సుందరికరించడంతో పాటు పార్క్‌ల నిర్మాణం, ఆడిటోరియం, స్టేడియాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలి..

మంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లు

హుస్నాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులైన పొన్నం ప్రభాకర్‌ సోమవారం తొలిసారిగా హుస్నాబాద్‌కు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి చాంబర్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాన్ని మరమ్మత్తులు చేస్తూ పేయింట్‌ వేస్తున్నారు. పట్టణంలో పార్టీ శ్రేణులు అడుగడుగునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బస్వాపూర్‌కు చేరుకుంటారు. 3గంటలకు హుస్నాబాద్‌ డిపో క్రాస్‌ రోడ్డు నుంచి ఊరేగింపులో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతారని పార్టీ నాయకులు తెలిపారు.

Updated Date - 2023-12-10T23:56:22+05:30 IST