సమావేశాలకు రాని అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-24T23:45:10+05:30 IST

మండల సమావేశంలో సభ్యుల తీర్మానం

సమావేశాలకు రాని అధికారులపై చర్యలు తీసుకోవాలి
నారాయణఖేడ్‌ మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ చాందీబాయిచౌహాన్‌

నారాయణఖేడ్‌, జనవరి 24: నారాయణఖేడ్‌లో మంగళవారం ఎంపీపీ చాందీబాయిచౌహాన్‌ అఽధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరుకాని అధికారులపై ఎంపీపీతో పాటు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతూ సభ్యులతో కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్‌నాయక్‌తో పాటు పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలుగా నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాల్లో మౌలికసదుపాయాలు కల్పించలేకపోతున్నామని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. మంజూరైన నిధులను దారిమళ్లించడం సరికాదన్నారు. పంచాయతీలకు మంజూరైన నిధులను గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమచేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ సాయిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:45:11+05:30 IST