వీడని ముసురు

ABN , First Publish Date - 2023-07-21T23:59:38+05:30 IST

సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు వర్షం కురిసింది. ఆ తర్వాత సాయంత్రం వరకు కాస్త విరామం ఇచ్చి మళ్లీ సాయంత్రం నుంచి ముసురు వర్షం కురిసింది. జిల్లాలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది

వీడని ముసురు
మద్దూరు మండలం గాగిళ్లాపూర్‌ చెరువు వద్ద చేపలు పట్టడానికి వచ్చిన జనం

మత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

దెబ్బతిన్న ఇళ్లు.. నీటమునిగిన పంటలు

జిల్లాలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

సిద్దిపేటఅగ్రికల్చర్‌/వర్గల్‌/రాయపోల్‌/కొండపాక/ములుగు/ మిరుదొడ్డి/తొగుట/కోహెడ/గజ్వేల్‌/మద్దూరు, జూలై 21: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు వర్షం కురిసింది. ఆ తర్వాత సాయంత్రం వరకు కాస్త విరామం ఇచ్చి మళ్లీ సాయంత్రం నుంచి ముసురు వర్షం కురిసింది. జిల్లాలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరుతున్నది. రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.

దెబ్బతిన్న నివాసాలు

తొగుట మండలంలో 4 ఇళ్లు, రాయపోల్‌లో 2, దౌల్తాబాద్‌లో 10, నారాయణరావుపేటలో ఒకటి, వర్గల్‌లో 14, దుబ్బాకలో 14, చిన్నకోడూరులో 30, కొండపాకలో 5, గజ్వేల్‌లో 14, మిరుదొడ్డిలో 5 , సిద్దిపేట రూరల్‌ 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆయా మండలాల్లో..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వర్గల్‌ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు, అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జలమయమైంది. గ్రామానికి దగ్గర్లో నాలుగు కుంటలు ఉండడంతో అందులో నుంచి ప్రవహిస్తున్న వరద నీరు గ్రామంలోని ప్రధాన రహదారిపైకి రావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు వర్గల్‌ మండల వ్యాప్తంగా 14 పెంకుటిళ్లు పాక్షికంగా దెబ్బతినట్లు అధికారులు గుర్తించారు. వర్గల్‌ 4, శేరిపల్లి 1, జెబ్బాపూర్‌ 1, శాఖారం 3, నెంటూర్‌ 5 దెబ్బతిన్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపారు. రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఆరురోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పలుగ్రామాల్లోని పురాతన ఇళ్లు దెబ్బతిన్నాయి. మండలంలోని వడ్డేపల్లిలో ఒక ఇల్లు, బేగంపేటలో ఒక ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దౌల్తాబాద్‌ మండలంలో దీపాయంపల్లిలో అయిదు, కోనాపూర్‌లో ఒకటి, మహ్మద్‌షాపూర్‌లో ఒకటి, దొమ్మాటలో రెండు, సూరంపల్లిలో ఒక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. కొండపాక మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయి. మర్పడగ చెరువు మత్తడి పారుతుంది. పలు గ్రామాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండపాకలోని శ్రీరామ్‌ (కట్ట మీది) సత్తయ్య ఇల్లు కూలిపోయింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో చికిత్స కోసం హైదరాబాదుకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎంపీపీ లావణ్య అంజన్న గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ములుగు ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కరెంటు స్తంభాలను తాకకూడదని హెచ్చరించారు. మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్‌లో రంగనబోయిన వెంకటవ్వ, లక్ష్మీ, చేప్యాలలో పల్లె గుండవ్వ, పోశవ్వ, కిష్టయ్యల పెంకుటిండ్లు కూలినట్లు తహసీల్దార్‌ తెలిపారు. బాధితులు వివరాలను జిల్లా అధికారులకు నివేదించామని చెప్పారు. కూడవెల్లి వాగు పొంగిపొర్లుతున్నది. మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. తొగుట మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలుగు ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌ తెలిపారు. తొగుటలో 1, మెట్టు లో 1, గుడికందులలో 2 ఇళ్లు పాక్షికంగా కూలిపోయినట్లు చెప్పారు. శుక్రవారం మండలంలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోహెడ మండలంలోని మోయతుమ్మెద వాగుపై నిర్మించిన చెక్‌డ్యాములు నిండి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పోరెడ్డిపల్లి, బస్వాపూర్‌, తంగళ్లపల్లి, కూరెళ్ల చెక్‌డ్యాం నిండి మత్తడి పోస్తుంది.శనిగరం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఒగ్గే వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టులోకి బస్వాపూర్‌ ఫీడర్‌ ఛానల్‌ ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు కొత్త తూం వద్ద 33 ఫీట్లు ఉండగా 23 ఫీట్ల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం ఒక టీఎంసీ కాగా మరో 10 ఫీట్లు నీరు వస్తే మత్తడి పడుతుంది. మరో వారం రోజులు ఇలాగే వరద కొనసాగితే ప్రాజెక్టు నిండి మత్తడి పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వర్షపాతం నమోదు.. మండలాల వారీగా

సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా ములుగు మండలంలో 7.8 సెంటిమీటర్లు, అత్యల్పంగా కొమురవెల్లి మండలంలో 2.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

వర్గల్‌లో 7.6, రాయపోల్‌లో 7.6, అక్కన్నపేటలో 7.1, దూల్మిట్టలో 5.4, మిరుదొడ్డిలో 5.2, నారాయణరావుపేటలో 5.1, మద్దూర్‌లో 4.9, మర్కుక్‌లో 4.7, జగదేవ్‌పూర్‌ 4.7, కొండపాకలో 4.3, దుబ్బాకలో 4.2, గజ్వేల్‌లో 4.1, కోహెడలో 4, హుస్నాబాద్‌లో 3.9, దౌల్తాబాద్‌లో 3.9, నంగునూరులో 3.8, సిద్దిపేట రూరల్‌లో 3.8, తొగుటలో 3.7, చేర్యాలలో 3.3, చిన్నకోడూరులో 3.2, సిద్దిపేట అర్బన్‌ 3.1, బెజ్జంకిలో 3.0 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

పొలాల్లో నీటిని తీసేయాలి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంట పొలాల్లో నీటిని వెంటనే తీసేయాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివకుమార్‌ సూచించారు. గజ్వేల్‌ మండల పరిధిలోని రిమ్మనగూడ, బయ్యారం గ్రామాల్లోని పంటలను జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ గజ్వేల్‌ మండల వ్యవసాయ అధికారి నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలు భారీగా కురుస్తున్నందున రైతులు వరిపొలాల్లో, మొక్కజొన్న, పత్తి పంటల్లో మొక్కల మధ్య నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. అధిక వర్షాలతో పత్తి మొక్కలు మొదట పసుపు రంగులోకి మారి తరువాత ఎర్రబడే అవకాశం ఉందని, దీనిని అధిగమించడానికి మొక్క వయసును బట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లేదా 19.19.19 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. వర్షాలు భారీగా కురిసిన నేపథ్యంలో పంట ఎదుగుదల తగ్గుతుందని, ఎదుగుదలను పెంచడానికి వర్షాలు తగ్గిన వెంటనే 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్‌ ఎరువులను మొక్కకు ఐదు సెంటిమీటర్ల దూరంలో వేసుకోవాలని ఆయన సూచించారు.

అధిక తేమ వల్ల పత్తి మొక్కలకు వేరుకుళ్లు తెగులు సోకడానికి అవకాశం ఉంటుందని, దీని నివారణకు మూడు గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ లేదా ఒక గ్రామం కార్భండజిమ్‌ లీటర్‌ నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై వారం వ్యవధిలో రెండుసార్లు పోయాలన్నారు. ఈ సమయంలో మొక్కజొన్నలో అధిక తేమ వలన భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుందని, వర్షాలు నిలిచిన తర్వాత పొటాషియం నైట్రేట్‌ లేదా 19.19.19, 10 గ్రాముల లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలన్నారు. వర్షాలు పూర్తిగా ఆగిన తర్వాత అదనపు మోతాదుగా ఎకరాకు 20 నుంచి 25కిలోల యూరియా, 15 నుంచి 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటా్‌షను అందజేయాలన్నారు. కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంటే క్లోరంట్రానిలిప్రోల్‌ 4 మిల్లిలీటర్‌ లేదా స్చైనటోరం 0.5 మిల్లిలీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేయాలని సూచించారు. వర్షాలకు వరినాటు వేసిన పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఆ పొలాలను దమ్ము చేసి మళ్లీ స్వల్పకాలిక రకాలను ఎంచుకుని నేరుగా విత్తుకోవాలని, చల్లటి వాతావరణంలో అగ్గితెగులు సోకే అవకాశం ఉందని చెప్పారు. నివారణకు టైస్రైక్లోజొల్‌, మానుకోజెబ్‌ 2.5గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ విస్తరణ అధికారులు నర్సింహులు, మాధవి, రైతులు ఉన్నారు.

మద్దూరులో..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాలతో పత్తిచేను పసుపు రంగులోకి మారే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మద్దూరు మండల వ్యవసాయాధికారి రామకృష్ణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పత్తిచేనును పరిశీలించి పలు సూచనలు చేశారు. పత్తిమొక్కల సాళ్ల మధ్య నీరు నిల్వకుండా చూసుకోవాలని చెప్పారు. అధిక వర్షాలతో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. కలుపు నివారణకు క్విజ్జాలోపాస్‌ 400 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు.

గాగిళ్లపూర్‌ పెద్దచెరువు వద్ద సందడి

మద్దూరు ఉమ్మడి మండలంలో లద్నూరు ఎల్లమ్మచెరువు, గాగిళ్లాపూర్‌ పెద్దచెరువు, కూటిగల్‌ నల్లచెరువు మత్తడి పోస్తున్నాయి. దూల్మిట్ట, లింగాపూర్‌, జాలపల్లిలోని చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. లద్నూరు, గాగిళ్లాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల, ముదిరాజ్‌లు తరలివచ్చి ఎదురెక్కుతున్న చేపల్ని పడుతూ సందడి చేశారు. టన్నుల కొద్ది చేపలు ఎదురెక్కుతుండటంతో పాటు తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో చెరువుల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొన్నది.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

సిద్దిపేటటౌన్‌: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజల కోసం సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సిద్దిపేటలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు సేవలందించేలా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశామని, మున్సిపల్‌ పరమైన సమస్యలు మురుగు కాలువలు, నీరు నిల్వడం, వీధి దీపాల సమస్య, చెట్లు విరిగిపడడం వర్షం నీరు నిలవడం, శిథిలావస్థకు చేరిన గృహాల వివరాలు, పారిశుధ్య సమస్యలపై సత్వరమే స్పందించనున్నట్లు వివరించారు. సమస్యల పరిష్కారానికి 9505507248కు ఫోన్‌ చేయాలని సూచించారు. చెత్తాచెదారం నిల్వకుండా పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు.

Updated Date - 2023-07-21T23:59:38+05:30 IST