తొమ్మిదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి

ABN , First Publish Date - 2023-06-03T00:08:20+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నూరేళ్ల అభివృద్ధి సాధించుకున్నందుకు గర్వంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

తొమ్మిదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

పండుగలా 21 రోజులు.. గ్రామగ్రామాన దశాబ్ది సంబురాలు

సీఎం కేసీఆర్‌ దీక్షాదక్షతతో సిద్దిపేట జిల్లాకు కీర్తికిరీటాలు

ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటటౌన్‌, జూన్‌2: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నూరేళ్ల అభివృద్ధి సాధించుకున్నందుకు గర్వంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రంగధాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి, ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా జాతీయజెండాను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపించారు. సిద్దిపేట జిల్లా అభివృద్దిపై 32 నిమిషాల పాటు హరీశ్‌రావు సందేశాన్ని వినిపించారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు.

జిల్లా ఏర్పాటుతో నవశకం.. తొమ్మిదేళ్లలో పదింతల ఫలితం

నాలుగు దశాబ్దాల కలను సాకారం చేస్తూ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాతో పాటు రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. నాడు గంటల కొద్దీ ప్రయాణం చేసి సంగారెడ్డికి రాకపోకలు చేసినవాళ్లు, నేడు నిమిషాల వ్యవధిలోనే అన్ని కార్యాలయాలకు చేరువ కావడమనేది గొప్ప విజయమని తెలిపారు. నాటి పాలకులు తెలంగాణలో వ్యవసాయం చేయడమంటే దండగ అంటూ చిత్రీకరించారని, వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతీరైతు కళ్లలో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ అని చెప్పారు.

మండుటెండల్లో మత్తళ్లు.. తాగునీటి తంటాలను తరిమేస్తూ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు జిల్లాలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కూడా లేదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గ్రామగ్రామాన గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయని చెప్పారు. కనీవిని ఎరుగని రీతిలో రంగనాయకసాగర్‌, కొమురవెల్లి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్లను అద్భుతంగా నిర్మించుకున్నట్లు ఆయన తెలిపారు. మండుటెండల్లో సైతం మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించేలా, సిద్దిపేట జిల్లాలో మిషన్‌భగీరథ ద్వారా 2.18 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

అన్నివర్గాలకు ఆపన్నహస్తంగా

కులవృత్తులను ప్రోత్సహించి వారు స్వయం సమృద్ధి సాధించేలా అనేక పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టిట్లు చెప్పారు. గొల్లకుర్మలకు మొదటివిడత కింద గొర్రెలను పంపిణీ చేయగా, రెండో విడతలో లబ్ధి చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలతో పాటు, చేపల అమ్మకం యూనిట్లు అందించామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పలు కులవృత్తులను ప్రోత్సహించడంతో వారి స్వయం ఉపాధి పెరిగినట్లు ఆయన చెప్పారు. కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 6 కిలోల చొప్పున రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నట్లు వివరించారు. పంటలు పండించడంతో పాటు, విక్రయించడంలోనూ మార్కెటింగ్‌ వ్యవస్థలో ముందున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో, పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, రూ. 297కోట్లతో గజ్వేల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయ్యిందని, రూ.160కోట్లతో సిద్దిపేట చుట్టూ 74 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పాటుతో సిద్దిపేట జిల్లా, కాళేశ్వర ప్రాజెక్టుతో గోదావరి జలాలు రాగా, ఇక రైలు సౌకర్యం ఒక్కటే మిగిలిందన్నారు.

అధ్వాన్నం నుంచి ఆధునిక వైద్యం దిశగా..

కార్పొరేట్‌ ఆసుపత్రులను మైమరిపించేలా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చి అధ్వాన్నం నుంచి ఆధునిక వైద్యం తీసుకొచ్చినట్లు వివరించారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలతో పాటు అనుసంధానంగా 880 పడకలుండగా, త్వరలోనే 950 పడకలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్లు, ఆరోగ్య మహిళ కేంద్రాలు, దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటలో రుతుప్రేమ తదితర అనేక పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

బడికి బాసట.. ఉత్తీర్ణతలో ఉత్సాహం

మనఊరు-మన బడి, మనబస్తీ-మనబడి అనే కార్యక్రమాలతో పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇక ఈ ఏడాది ఎస్‌ఎ్‌సస్సీలో 98.65 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా 2వ స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి కూడా సాధ్యం కాని విధంగా వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని, అందుకు గర్వంగా ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనలో పోలీసుశాఖను పటిష్టం చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సెన్‌, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:08:20+05:30 IST