విద్యుత్‌కు విపత్తు

ABN , First Publish Date - 2023-05-04T23:58:08+05:30 IST

వడగండ్లు, ఈదురుగాలుల బీభత్సానికి వరిపొలాలు, తోటలే కాదు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి.

విద్యుత్‌కు విపత్తు
కొండపాక మండలం దుద్దెడ శివారులో నేలకూలిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

ఈదురుగాలులు, వడగండ్లతో ముప్పు

కుప్పకూలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు

వానొచ్చిందంటే తప్పని అంతరాయం

పొలాల వద్ద ప్రమాదకర పరిస్థితులు

తాజా పరిణామాలతో రూ.2కోట్లపైనే నష్టం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 4 : వడగండ్లు, ఈదురుగాలుల బీభత్సానికి వరిపొలాలు, తోటలే కాదు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాళ్ల వానలు పడడంతో విద్యుత్‌ శాఖకు భారీగానే నష్టం వాటిల్లింది. సరఫరాకూ తీవ్ర అంతరాయం నెలకొంది. ఇప్పటికీ పలుచోట్ల మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.

విద్యుత్‌ శాఖకు రూ.2కోట్లపైచిలుకు నష్టం

జిల్లాలోని అన్ని మండలాల్లో వడగండ్లకు ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్‌ శాఖకు రూ.2కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వరుసగా నాలుగురోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల కారణంగా ట్రాన్స్‌కో అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా 708 ఎల్టీ స్తంభాలు, 271 ప్రదేశాల్లో 11 కేవీ స్తంభాలు, నాలుగు చోట్ల 33 కేవీ స్తంభాలు నేలకూలాయి. ఇవి గాకుండా వందలకొద్దీ స్తంభాలు దెబ్బతిన్నాయి. స్తంభాలు నేలకూలడంతో తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతున్నాయి.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

వడగండ్ల బీభత్సానికి జిల్లాలోని పలు గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాల్లో 24గంటలు దాటినా విద్యుత్‌ సరఫరా జరగలేదు. చెట్లకొమ్మలు విరిగిపడి స్తంభాలు, తీగలపై పడడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటిని తొలగించి మళ్లీ సరఫరా పునరుద్దరించేదాకా అంతరాయం తప్పలేదు. నాలుగురోజుల పాటు విద్యుత్‌ అధికారులు, ఉద్యోగులు కంటిమీద కునుకు లేకుండా విధుల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పటికీ పలుచోట్ల విద్యుత్‌ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటిని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పొలాల వద్దకు వెళ్లే రైతులు, బాటసారులకు ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు లేకపోలేదు. అంతేగాకుండా గ్రామాలు, పట్టణాల్లోనూ తీగలకు ఆనుకొనే చెట్ల కొమ్మలు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

స్పెషల్‌డ్రైవ్‌ చేపడితేనే!

ప్రస్తుతం వేసవికాలమైనప్పటికీ వడగండ్ల కారణంగా వారం రోజులపాటు వర్షాకాలాన్ని తలపించింది. మరో నెలరోజులు గడిస్తే మళ్లీ వర్షాకాలం ఆరంభమవుతుంది. ఇప్పటికైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. రానున్న రోజుల్లో మళ్లీ విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకర స్థితిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, తీగలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈదురుగాలులకు, వరదలకు స్తంభాలు నేలకూలకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తప్పదు.

Updated Date - 2023-05-04T23:58:08+05:30 IST