కారును ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2023-05-27T00:32:58+05:30 IST

కారును బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా 8నెలల పాప మరణించింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది.

కారును ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి
ధ్వంసమైన కారు, ఇన్‌సెట్‌లో హర్షిత(ఫైల్‌), మృతి చెందిన నాగరాజుగౌడ్‌,

మరో ముగ్గురి పరిస్థితి విషమం.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘటన

కొల్చారం/పాపన్నపేట, మే 26: కారును బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా 8నెలల పాప మరణించింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని జైనమందిరం వద్ద శుక్రవారం చోటుచేసుకున్నది. మెదక్‌ రూరల్‌ సీఐ విజయ్‌ వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన టేక్మాల్‌ నాగరాజు గౌడ్‌(30) తన తల్లి, అన్న అయిన టేక్మాల్‌ దుర్గాగౌడ్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఒక శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో కొల్చారం మండలకేంద్రంలోని జైనమందిరం వద్దకు చేరుకోగానే మెదక్‌ నుండి అతి వేగంగా వస్తున్న బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జనుజ్జయ్యింది. ప్రమాదంలో నాగరాజు గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, దుర్గాగౌడ్‌ కూతురు హర్షిత(8నెలలు) ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా కారులో ప్రయాణిస్తున్న టేక్మాల్‌ దుర్గాగౌడ్‌, భార్య లావణ్య, కుమారుడు చోటు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి రామమ్మ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులను నర్సాపూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు రూరల్‌ సీఐ విజయ్‌, ఏఎ్‌సఐ తారాసింగ్‌ తెలిపారు. కాగా ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో ఎల్లాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడికి చేరుకున్న బంధువులు, గ్రామస్థులు చనిపోయిన వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులను మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే పరామర్శించి రూ.20వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.

Updated Date - 2023-05-27T00:33:06+05:30 IST