ఉపాధికి ఊతం

ABN , First Publish Date - 2023-06-26T00:33:40+05:30 IST

కార్మికులకు న్యాక్‌ సంస్థ అందించే శిక్షణ ఉపాధి మార్గాలను చూపుతున్నది.

ఉపాధికి ఊతం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 6 న్యాక్‌ శిక్షణ కేంద్రాలు

ఏటా 3వేల మందికి వృత్తి శిక్షణ

జహీరాబాద్‌, జూన్‌ 25: కార్మికులకు న్యాక్‌ సంస్థ అందించే శిక్షణ ఉపాధి మార్గాలను చూపుతున్నది. భవన నిర్మాణ రంగంలో కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకునేషనల్‌ అకాడమిక్‌ ఆఫ్‌ కన్స్‌ట్రక్షన్‌ కృషి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా తాపి, వడ్రంగి, టైలరింగ్‌, ఫ్లంబింగ్‌, ఎలక్ర్టీషయన్‌ తదితర రంగాల్లో న్యాక్‌ సంస్థ నుంచి శిక్షణ పొందిన ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. శిక్షణా సమయంలో ఒక్కో కార్మికుడిపై ప్రతీరోజు రూ.500 వరకు ఖర్చు చేసి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నది.

ఉమ్మడి జిల్లాలో ఏటా 3వేల మందికి శిక్షణ

న్యాక్‌ సంస్థ ఆధ్వర్యంలో 20 కేంద్రాల ద్వారా ఏటా 10వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట, రామాయంపేట, మెదక్‌, సంగారెడ్డి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో 500 మంది చొప్పున జిల్లాలో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ సంవత్సరం జూన్‌లో ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి చివరి వరకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తారు. కార్మికుల ఆసక్తిని బట్టి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తుంటామని న్యాక్‌ అధికారులు తెలిపారు. తాపిమేస్త్రీలకు 15 రోజుల పాటు శిక్షణను ఇస్తామని, నెలకు 20 మంది బ్యాచ్‌ చొప్పున 8 నెలల్లో 160 మందికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. రోజుకు రూ.300 చొప్పున 15 రోజులకు రూ.4,500 ఇస్తామని తెలియజేశారు. టైలరింగ్‌, వైరింగ్‌ తదితర రంగాల్లో 25 మంది చొప్పున మూడు నెలలకు ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఏడాదికి 3 బ్యాచుల్లో 100 మందికి శిక్షణ ఇస్తామని వివరించారు. ఫ్లంబింగ్‌, ఎలక్ర్టీషియన్‌, వడ్రంగి తదితర అంశాల్లోనూ ఇదేవిధంగా శిక్షణ ఇస్తామన్నారు.

శిక్షణలో చాలా నేర్చుకుంటున్నాం

-శ్రీనివాస్‌, రాంనగర్‌, జహీరాబాద్‌

తాపీమేస్త్రీ శిక్షణలో అనేక కొత్త అంశాలను నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు శిక్షణ తీసుకునేందుకు ముందుకురావాలి.

వృత్తిలో మెరుగుదల

-హోటల్‌ రాజు, బాగారెడ్డిపల్లి, జహీరాబాద్‌

భవన నిర్మాణరంగ కార్మికులకు శిక్షణ అత్యవసరం. గుడ్డిగా పనులను చేస్తే యజమాని నష్టపోవడంతో పాటు తృప్తి ఉండదు. న్యాక్‌ శిక్షణతో సర్టిఫికెట్‌ రావడంతో పాటు మార్కెట్లో గుర్తింపు పెరుగుతుంది.

భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

-నగేష్‌, న్యాక్‌ శిక్షణ ఇన్‌స్ట్రక్టర్‌

న్యాక్‌ సంస్థ ఇస్తున్న శిక్షణలో నేర్చుకున్న అంశాలు నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో ఎంతగానో ఉపయోగపడతాయి. శిక్షణ సమయంలో కార్మికులకు భోజన వసతి, ప్రతీ రోజు రూ.300 గౌరవ వేతనం అందజేస్తాం. ఇప్పటివరకు వేల మంది కార్మికులకు శిక్షణ ఇచ్చాం. కార్మికశాఖ నిధులను కేటాయిస్తే, న్యాక్‌ సంస్థ శిక్షణ ఇస్తుంది. శిక్షణ తీసుకున్న ప్రతీ కార్మికుడికి సర్టిఫికెట్లను అందజేస్తాం.

Updated Date - 2023-06-26T00:33:40+05:30 IST