పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలే?

ABN , First Publish Date - 2023-05-15T00:23:06+05:30 IST

తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు ఎందుకు పూర్తిచేయలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలే?

కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు నీళ్లిచ్చే కాళేశ్వరం ఎట్ల పూర్తయ్యింది

గత ప్రభుత్వాల్లో మిగిలిన పనులు చేసి నీళ్లిచ్చామంటున్నారు

ఆత్మగౌరవం ఎజెండాతో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడమే లక్ష్యం

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

2014కు ముందు.. తర్వాత నీ ఆస్తులెంతో ప్రజలందరికీ తెలుసు

మీ అసమర్థత వల్లనే శ్రీశైలం నుంచి నీళ్లు మే వరకు తీసుకోలేకపోయాం

వనపర్తి ఆత్మగౌరవ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, మే 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు ఎందుకు పూర్తిచేయలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరుతోపాటే శంకుస్థాపన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా పూర్తయ్యిందని, కేవలం కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌కు నీళ్లొస్తాయని ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇక్కడి రైతుల కష్టాలను తీర్చే పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 10 శాతం మిగిలిన ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి.. తామే నీళ్లిచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆత్మగౌరవం ఎజెండాతో బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించమే లక్ష్యంగా పని చేస్తామని, సమీకరణల ఆధారంగా వేదికను నిర్ణయించుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. వనపర్తికి సాగునీరు తీసుకురావడం నిరంజన్‌రెడ్డి ఘనత కాదని, చిన్నారెడ్డి కృషితోనే సాగునీళ్లు వచ్చాయని అన్నారు. ఆయన కృషితోనే 25 టీఎంసీల కేటాయింపులు.. 40 టీఎంసీలకు పెరిగాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో ఎంజీకేఎల్‌ఐ శంకుస్థాపన సమయంలో కోర్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి 5 0వేల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చేందుకు నిర్ణయిస్తే.. ఆ రోజు ఏం చేశారని ప్రశ్నించారు. నాగం జనార్దన్‌రెడ్డి కృషితో 50 వేల నుంచి 2.50 లక్షల ఎకరాలకు ప్రాజెక్టు పరిధిని పెంచారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేస్తే.. ఎందుకు ఒక్క ప్రజాప్రతినిధిని గెలిపించుకోలేక పోయారని ప్రశ్నించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌లో గెలిపిస్తే.. గొప్ప ఉద్యకారుడు ఏం చేశారని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్‌లో పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయిన నిరంజన్‌రెడ్డి.. 2014లో ఉద్యమం చేసిన వ్యక్తి ఎలా ఓడిపోయారో చెప్పాలని అన్నారు. ఓడిన తర్వాత ఆర్నెల్లు ఆగలేక పదవి తెచ్చుకున్నారని అన్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిరంజన్‌రెడ్డి ఎన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించారో తెలపాలని కోరారు. ప్రాజెక్టుల నుంచి దోచుకున్న వారితో కొన్నిచోట్ల ఇళ్లు కట్టించి అందరికీ ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఆ మొత్తానికి ఇళ్లు కట్టలేమని ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. అప్పుడు రూ. 5 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని రూ. 3 లక్షలకు కుదించారని అన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత ఏ పద్ధతి ప్రకారం ఈ నిర్మాణ వ్యయం నిర్ణయించారో తెలిపాలని ప్రశ్నించారు. చెప్పుతో నాలుక కోస్తా అని మాట్లాడే సంస్కృతి తనది కాదని, సంస్కారంతో మాట్లాడుతామని తెలిపారు. అన్ని పార్టీల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారని తెలిపిన వారు.. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొంటున్నారని, మరి అదే మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల పంపిణీ, రైతు రుణమాఫీ పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. నిరంజన్‌రెడ్డి చేసిన అవినీతిని భరించలేక చంద్రబాబు ఖాదీ బోర్డుకు రాజీనామా చేయమంటే చేయకుండా ఉన్నందుకు ఆయన సంస్థనే రద్దు చేశారని గుర్తు చేశారు. అందరు లాయర్లు గెలవడానికి ఫీజు తీసుకుంటారని, కానీ నిరంజన్‌రెడ్డికి ఓడటానికి కూడా డబ్బులు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు పాదయాత్ర చేశానని, ప్రమాణ స్వీకారం సమయంలో కూడా తల ఎత్తుకునే ఉన్నానని, కానీ ఇప్పటి మంత్రులు తలదించుకుని.. అడుగులకు మడుగులు ఒత్తి ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నారని విమర్శించారు. మేఘారెడ్డిలాంటి అనేక మంది మంజూరు లేకున్నా పనులు చేసి నీళ్లు ఇస్తే.. నిరంజన్‌రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని అన్నారు. తన ఇంట్లో రాజశేఖర్‌రెడ్డి ఫొటో ఉందని, ఉంటుందని, కేసీఆర్‌ ఫొటో కూడా ఉండేదని, రాజశేఖర్‌రెడ్డిది కాకుండా దొంగలు, దోపిడీదారుల ఫొటోలు పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఇంట్లో ఏ ఫొటోలు పెట్టుకోవాలో జీవో ఇస్తే.. అలాగే చేస్తామని ఎద్దేవా చేశారు. అడుగులకు మడుగులు ఒత్తే అధికారులను పెట్టుకుని ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబరు వరకు వర్షాలు కురిసిన రోజుల్లో కూడా మే వరకు కల్వకుర్తి ద్వారా నీళ్లు ఇచ్చామని, కానీ నవంబరు వరకు వర్షాలు కురిసినా కూడా ఈ ఏడాది మార్చిలోనే పంపులను ఆపేసిన అసమర్థులని ఆరోపించారు. కేవలం కరెంటు కోసమే నీళ్లను మొత్తం కిందకు విడిచారని తెలిపారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ అయిన తర్వాతనే తన కూతుర్లు విదేశాల నుంచి డబ్బు పంపించారా? అంతకుముందు నుంచే వారు విదేశాల్లో ఉంటున్నారు కదా? అని ప్రశ్నించారు. 2005కు ముందు నిరంజన్‌రెడ్డి పరిస్థితి ఎంటో.. ఇప్పుడు పరిస్థితి ఎంటో ప్రజలు గమనించాలని కోరారు. తాను ప్రజాప్రతినిధిగా లేను కాబట్టి.. తనకు సమాచారం ఎందుకు ఇవ్వాలంటున్న నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత పలు ఎన్నికలకు తనకు ఎందుకు ఫోన్‌చేసి మద్దతు అడిగారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టావా? అని తనను ప్రశ్నిస్తున్న నిరంజన్‌రెడ్డి.. గొప్ప ఉద్యమకారుడైన తాను విగ్రహం పెట్టాడా? అని ప్రశ్నించారు. తాను మహబూబ్‌నగర్‌లో 2015లో సొంత ఖర్చులు రూ.35 లక్షలతో అమరవీరుల స్థూపం కట్టించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇందిరాగాంధీకి కూడా ఓటమి తప్పలేదని, ఇప్పుడు ఆట ప్రారంభమైందని, భరతం పడతామని అన్నారు.

గత పాలకులు కూడా చేసింది అభివృద్ధే: ఎంపీపీ మేఘారెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి నుంచి కుమూదిని దేవి, జయరాములు, అయ్యప్ప, బాలకిష్టయ్య, చిన్నారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలాంటి నాయకులు కూడా వనపర్తిని అభివృద్ధి చేశారని, 1959లోనే మొదటి పాలిటెక్నిక్‌ కళాశాల వనపర్తిలో జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తెలిపారు. సప్తసముద్రాలు, సరళాసాగర్‌ లాంటి ఎన్నో గొప్ప అభివృద్ధి పనులు అప్పుడే జరిగాయని అన్నారు. ఆత్మగౌరవ నినాదంతో పార్టీ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. తాను రూ. వెయ్యి కోట్ల పనులు చేస్తే అందులో రూ. 20 కోట్లు మాత్రమే ఇక్కడ చేశానని తెలిపారు. తాను కూలీని అంటున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. తన కూలీ తనకు ఇవ్వకుండా బినామీలతో ఎందుకు కాజేశారో వీరాయిపల్లి వేరుశనగ పరిశోధన కేంద్రం వద్దకు వచ్చి చెప్పాలన్నారు. ఫైల్స్‌ పెండింగ్‌లో పెట్టి బిల్లులను ఆపిన ఘనత నిరంజన్‌రెడ్డిదని అన్నారు. చాలామంది పిల్లలు విదేశాల్లో ఉన్నారని, వారు ఇంత ఆస్తులు ఎందుకు కూడబెట్టుకోలేదో అర్థం కావడం లేదన్నారు. ఎస్టీ అబ్బాయిని దత్తత తీసుకోవడం మంచిదే కానీ.. అతడి పేరు మీద ఉన్న భూమిని సబ్సిడీలు తీసుకున్న తర్వాత ఎందుకు తన కూతుర్ల పేరుతో ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని ప్రశ్నించారు. స్ర్టీట్‌ లైట్‌ నుంచి చెరువు పనుల వరకు అన్నీ తనే చేస్తున్నారని, ప్రపంచంలో బ్యాక్‌ సైడ్‌ చెరువుకు రివిట్‌మెంట్‌ ఎవరూ కట్టరని అన్నారు. నిధులు కాజేసే కుట్రలోనే ఆ నిర్మాణం చేశారని అన్నారు. ఎస్‌డీఎఫ్‌, సీఎస్‌ఆర్‌ బిల్లులు ఎవరికి వెళ్తున్నాయి.. ఎవరు పనులు చేస్తున్నారు తెలపాలన్నారు. ఒక సర్వే నెంబర్‌లో 12 ఎకరాల భూమి ఉంటే దాన్ని 24 ఎకరాలు ఎలా చేశారని ప్రశ్నించారు. చదువుకున్న వారిని హమాలీ పని చేయమని, మహిళను మంగళవారం మరదలు అని అభాసుపాలయ్యారని అన్నారు. కేసులకు, లాఠీ దెబ్బలకు, తూటాలకు తెగపడి ఉన్నామని, అధికారులు తమ డ్యూటీ తాము చేసుకోవాలని.. చెప్పినట్లు తలూపితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తూ.. ప్రజాస్వామ్యానికి బదులు నిరంకుశాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రలోభాలు, కేసులు పెడతారని, నాయకులు, ప్రజలు బెదరవద్దని కోరారు. మంత్రి నుంచి వార్డు మెంబర్‌ వరకు అన్ని అధికారాలను తన దగ్గరే ఉంచుకుని నిరంకుశ పాలన కొనసాగుతోందని అన్నారు. సమావేశంలో కొత్తగూడెం జడ్పీ చైర్మన్‌ కోరం కనుకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆత్మగౌరవ సభకు జడ్పీచైర్మన్‌ డుమ్మా...

వనపర్తిలో నిర్వహించిన ఆత్మగౌరవ సభకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే నినాదంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి మార్చిలో రాజీనామా ప్రకటించిన ఆయన.. కొద్దిరోజులుగా తనతో రాజీనామా చేసిన నేతలతో దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహించడం, ఆయన ఆ సభకు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిర్వహించిన సభలో పాల్గొన్నవారు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని, కానీ లోక్‌నాథ్‌రెడ్డి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సభకు రాలేదా? అనే చర్చ జరుగుతోంది. కార్యక్రమం ఫ్లెక్సీల్లో ఆయన ఫొటోను ముద్రించినా ఆయన మాత్రం సభకు దూరంగా ఉన్నారు. ఒకే నినాదంతో పార్టీకి రాజీనామా చేసిన నేతల్లో ఇప్పుడే కుమ్ములాటలు రావడం.. కీలకమైన జడ్పీచైర్మన్‌ సభకు హాజరుకాక పోవడం వెనుక కారణాలను పలు రకాలుగా విశ్లేషించు కుంటున్నారు.

Updated Date - 2023-05-15T00:23:06+05:30 IST