ధరణి తిప్పలు తీరేదెన్నడో..

ABN , First Publish Date - 2023-07-11T23:10:24+05:30 IST

ధరణి పోర్టల్‌ అమలు లోపాలపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. సాదాబైనామాల నమోదు సమయంలో కొందరు రైతుల భూముల వివరాలు నమోదు కాకపోవడం, పొరపాట్లు జరగడం, అసైన్డ్‌ భూముల నమోదులో ఇష్టారీతిన అవలంభించడం వంటి కారణాలతో అధిక సంఖ్యలో రైతులు పట్టాలు పొందలేకపోయారు.

ధరణి తిప్పలు తీరేదెన్నడో..

సాదాబైనామాల నమోదుకు ఆప్షన్‌ లేక వేలాది మంది రైతుల ఇక్కట్లు

పోర్టల్‌లో నమోదు సమయంలో తప్పులతో పలువురి ఆందోళన

అసైన్డ్‌ భూములు నిషేధిత జాబితాలో చేరడంతో నిరుపేదల ఆవేదన

కరక్షన్‌ ఆప్షన్‌ కలెక్టర్లకు వచ్చినా, ముందుకు సాగని ప్రక్రియ

నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్న వేలాది మంది రైతులు

మహబూబ్‌నగర్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధరణి పోర్టల్‌ అమలు లోపాలపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. సాదాబైనామాల నమోదు సమయంలో కొందరు రైతుల భూముల వివరాలు నమోదు కాకపోవడం, పొరపాట్లు జరగడం, అసైన్డ్‌ భూముల నమోదులో ఇష్టారీతిన అవలంభించడం వంటి కారణాలతో అధిక సంఖ్యలో రైతులు పట్టాలు పొందలేకపోయారు. దాంతో వారంతా నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరితో పాటు అసైన్డ్‌ భూములు పొందిన పలువురు రైతుల వివరాలను ధరణిలో నమోదు చేయకపోగా, వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఇవన్నీ స్వల్ప సమస్యలేనని, ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక రైతులకు రిజిస్ర్టేషన్ల కోసం, పహాణీల కోసం ఇతర అవసరాల కోసం రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, నకిలీ రిజిస్ట్రే షన్లకు, తప్పుడు డాక్యుమెంట్లకు కాలం చెల్లిందని ప్రభుత్వం చెబుతోంది. ధరణికి మునుపు రిజిస్ట్రేషన్లు చేసుకుంటే పాసు పుస్తకాల కోసం కనీసం మూడు నెలలు వేచి ఉండాల్సి వచ్చే దని, ఇప్పుడు సాయంత్రానికి పాసు బుక్కు చేతికి వస్తుందనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ధరణి నమోదు సమయంలో జరిగిన పొరపాట్లు, తప్పులు, లోటు పాట్లను సరిచేసేందుకు ఇటీవల కలెక్టర్లకు లాగిన్‌ ఇచ్చినప్పటికీ వారు బిజీ షెడ్యూల్‌ నేపథ్యంలో పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది.

సాదాబైనామాల కోసం ఎదురు చూపు

ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక సాదాబైనామాలను ధరణిలో నమోదు చేసేందుకు నెల రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. ఆ సమయంలో చాలా మంది నమోదు చేసుకోలేకపోయారు. తర్వాత వీటి నమోదు ఆపేయడంతో ఇప్పుడు దాదాపు ప్రతీ గ్రామంలో రైతులు సాదాబైనామాల నమోదు కోసం ఎదురుచూస్తున్నారు. సగటున ప్రతీ మండలంలో వెయ్యికిపైగా ఈ సమస్యలు నెలకొన్నాయనేదని ఒక అంచనా. దేవరకద్ర మండలం కోయిలసాగర్‌కు చెందిన ఒక రైతు దీనపరిస్థితి ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈగ్రామానికి చెందిన రైతు పెంటన్న పెద్దరాజమూరు శివారులో గొల్ల ఈశ్వరయ్యకు చెందిన 2.30 ఎకరాల భూమిని దాదాపు 20 ఏళ్ల క్రితం సాదాబైనామా ద్వారా కొన్నారు. ఆతర్వాత ఆయన పట్టాల కోసం పట్టించుకో లేదు. ధరణి వచ్చాక ఇవి చెల్లవనే నిర్ణయంతో ధరణి నమోదుకు ప్రయుయత్నించారు. ప్రస్తుతం లాగిన్‌ లేకపోవడంతో వారం, వారం తహసీల్‌ చుట్టూ తిరుగుతున్నారు.

13 ఎకరాలకు 7 ఎకరాలే నమోదు

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తూంపల్లికి చెందిన తిరుపతయ్య అదే గ్రామానికి చెందిన చిన్న నాగిరెడ్డి వద్ద సర్వే నెంబర్‌ 117లో 30 ఏళ్ల క్రితం 13.24 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ సమయంలో మాన్యువల్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు 13.24 ఎకరాల భూమికి పట్టాదారు పాసు బుక్కులు, టైటిల్‌ డీడ్‌ పొందారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక తిరుపతయ్య భూమి 7.04 ఎకరాలు మాత్రమే నమోదైంది. ఖాస్రా రికార్డుల ప్రకారం ఇంతేభూమి ఉందని, అంతవరకు ధరణిలో నమోదు చేశామనేది రెవెన్యూ అధికారుల వాదన అయితే, తనకు మాన్యువల్‌గా రిజిస్ట్రేషన్‌ సమయంలో వచ్చిన పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌ ప్రకారం ధరణిలోనూ నమోదు చేయాలని రైతు తిరుపతయ్య వాదిస్తున్నారు. పొజిషన్‌ సర్వే నిర్వహించి, పంచనామా చేసి పొడి రిపోర్టు ఆధారంగా ఇక్కడ భూమిని తేల్చాల్సిన రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దాంతో సమస్య అలాగే మిగిలిపోయింది.

సాగు భూమి నాలాగా నమోదు

చిన్నచింతకుంట మండలం ఫర్ధీపూర్‌కు చెందిన కావలి నరేందర్‌ 2015లో సర్వే నెంబర్‌ 408లో చాకలి రాములు వద్ద 1.21 ఎకరాల భూమిని కొన్నారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక సాగు భూమిని నాలా భూమిగా నమో దు చేశారు. ధరణిలో నమోదు చేసే సందర్భంలో సిబ్బంది అజాగ్రత్త వల్ల ఈతప్పిదం జరిగింది. దీంతో రైతు నరందర్‌ భూమి వాణిజ్య, గృహ అవసర భూమిగా మారింది. దీంతో ఆయన రైతుబంధు కోల్పోతున్నారు. తనభూమి సాగుభూవి అని, ధరణిలో జరిగిన పొరపాటుని సరిచేయాలని ఆయన రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

కబ్జాచేసిన వారికే పట్టా

నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శంభురాణి బైరంకొండ రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ 29-ఈలో మూడు ఎకరాల భూమిని 1993లో కొనుగోలు చేశారు. ఈ మేరకు అప్పట్లో పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌ పొందారు. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాక ఈమె భూమిని 2.08 ఎకరాలుగా నమోదు చేసి పట్టా ఇచ్చారు. అయితే తమ భూమిలో ఎకరం మేర రెవెన్యూ అధికారుల అండతో కబ్జా చేసిన వారే ధరణిలో నమోదు చేసుకున్నారని శంభురాణి వాపోతున్నారు. తాము ఎలాంటి క్రయ డాక్యుమెంట్‌ కానీ, రిజిస్ట్రేషన్‌ కానీ చేయకుండా ఎలా తమ భూమిని వేరేవారికి ధరణిలో రిజిస్టర్‌ చేశారని నిలదీస్తున్నారు. ఈవిషయమై ఈమె కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

కలెక్టర్‌ పేరున భూమి నమోదు

గద్వాల పట్టణానికి చెందిన పార్వతీదేవికి ఇదే పట్టణంలోని సర్వే నెంబర్‌ 780/ఏ2లో 1.22 ఎకరాల భూమి ఉంది. ఈభూమి పొరపాటున రెవెన్యూ అధికారుల తప్పిదంతో కలెక్టరేట్‌ కార్యాలయం పేరున నమోదైంది. దీంతో 2017 నుంచి ఈమె సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 2018లో ప్రీలిటిగేషన్‌ కేసు, ఎల్‌ఆర్‌యూపీలోనూ వీరు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగానికీ ఫిర్యాదు ఇచ్చారు. సీసీఎల్‌ఏ నుంచి ఈ భూమిపై ఈవిడ పేరును ఇంప్లిమెంటేషన్‌ చేయమని కలెక్టర్‌కు ఆదేశాలొచ్చినా, ధరణిలో ఆప్షన్‌ లేదని పరిష్కరించడం లేదు. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఆప్షన్‌ వచ్చినా తన సమస్యను పరిష్కరించి పాసుబుక్కు ఇవ్వడం లేదని పార్వతమ్మ వాపోతున్నారు.

పట్టా భూమి మిస్సింగ్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాధవానిపల్లి రెవెన్యూ శివారులో ఆదా రాంచంద్రయ్యకు 541 సర్వే నెంబర్‌లో 2.37 ఎకరాల భూమి ఉంది. ధరణి నమోదు సమయంలో ఈ భూమి వేరేవారి పేరున నమోదైంది. దీంతో తన భూమిని తన పేరున మార్చాలని రాంచంద్రయ్య మూడేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆప్షన్‌ లేదనే సాకుతో ఈ సమస్యను పరిష్కరించడం లేదు.

Updated Date - 2023-07-11T23:10:40+05:30 IST