ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు

ABN , First Publish Date - 2023-01-25T23:15:07+05:30 IST

ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతీ ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు.

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు

జిల్లా కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట/టౌన్‌/రూరల్‌/మరికల్‌/కృష్ణ/మాగనూరు/ఊట్కూర్‌, జనవరి 25 : ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతీ ఒక్కరు తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించి ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొని, విధిగా ఓటును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ నుంచి ర్యాలీ పుర వీధుల గుండా పాఠశాల మైదానానికి చేరుకోగా ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు కలెక్టర్‌ ఓటరు గుర్తింపు కార్డును అందించారు. జిల్లాలో కొత్తగా 900 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వారికి కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమయంలో సమరయోధుల బలిదానాలు పొందిన తర్వాత గణతంత్ర దినోత్సవం కంటే ఒక్కరోజు ముందు జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఓటు నమోదు చేసుకోకుంటే ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు బీఎల్‌వోలను సంప్రదించి ఓటు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సీనియర్‌ సిటిజన్స్‌ను కలెక్టర్‌ సన్మానించారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిచే అధికారులు ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్‌ బహుమతులు అందించారు. అదనపు కలెక్టర్లు మయాంక్‌ మిట్టల్‌, పద్మజారాణి, ఆర్డీవో రాంచందర్‌, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- జిల్లా వ్యాప్తంగా బుధవారం ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పేట రెండో వార్డులో కౌన్సిలర్‌ జొన్నల అనిత సుభాష్‌ ఆధ్వర్యంలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. దామరగిద్దలో హైస్కూల్‌ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, సంజీవరాయ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు ఈదప్ప, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు భీమయ్యగౌడ్‌, ఎంపీడీవో రామన్న, రిటైర్డ్‌ టీచర్‌ రాంమోహన్‌రావు, మాజీ కౌన్సిలర్‌ వినోద్‌, రాంరెడ్డి, సీతారాములు పాల్గొన్నారు.

- నారాయణపేట మండలం జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. హెచ్‌ఎం సత్యనారాయణ, భానుప్రకాశ్‌, లక్ష్మణ్‌, సురేఖ, మాధవి, శోభారాణి పాల్గొన్నారు.

- మరికల్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ రామ్‌కోటి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తాలో మానవహారం నిర్వహించి, ఓటర్లచే ఓటర్‌ ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు ఆయుధం కన్నా గొప్పదన్నారు. ఎంపీడీవో యశోదమ్మ, డీటీ శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌రావు, ఆర్‌ఐ శ్రీశైలం పాల్గొన్నారు.

- కృష్ణ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అర్హులు ఓటు హక్కు పొందాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.

- మాగనూరు మండల కేంద్రంలో తహసీల్దార్‌ తిరుపతయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ఓటరు దినోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. అదే విధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు విద్యార్థులచే గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ పర్వతాలు, పెన్షనర్స్‌ సంఘం అధ్యక్షుడు బి.గోపాలం, బీఆర్‌ఎస్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, అమరేందర్‌రెడ్డి, హెచ్‌ఎం అనిల్‌గౌడ్‌, దత్తురావు, పీఈటీ ఎం.రాజేశ్వరి, సర్పంచులు మంజుల, రాఘవేంద్ర, నిర్మలాదేవి, తారమ్మ, ఎంపీటీసీ సభ్యుడు ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

- ఊట్కూరు మండలం చిన్నపొర్ల ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం క్వీజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలాగే బ్యాలేట్‌ అంటె బుల్లెట్‌ అనే వివరించేలా చిత్రాన్ని గీసీ ప్రదర్శించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం జగాన్నథ్‌రావు మాట్లాడుతూ ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి పాలకుడిని ఎన్నుకోవచ్చని అన్నారు. ఉపాధ్యాయుల రాయల్‌ హెన్నా, కృష్ణమ్మ, నర్సింహా, విజయ్‌కుమార్‌, భాస్కర్‌, శ్రీధర్‌, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T23:15:08+05:30 IST