నేడు సంక్రాంతి

ABN , First Publish Date - 2023-01-14T23:22:11+05:30 IST

నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి), జనవరి 14: సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకోనున్నారు.

నేడు సంక్రాంతి
మహబూబ్‌నగర్‌లో భోగిమంట వద్ద యువతులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి

రంగవల్లులతో కళకళలాడుతున్న లోగిళ్ళు

జనంతో కిటకిటలాడుతున పల్లెలు

గంగిరెద్దుల విన్యాసాలు.. పతంగుల ఎగురవేత

మహబూబ్‌నగర్‌లో ఆవుపేడ పంపిణీ

మహబూబ్‌నగర్‌/నారాయణపేట/గద్వాల టౌన్‌/వనపర్తి రాజీవ్‌ చౌరస్తా/ నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి), జనవరి 14: సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ కోసం జనమంతా పల్లెలకు వెళ్లడంతో ఊళ్లన్నీ సందడిగా మారాయి. మూడు రోజుల ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు శనివారం భోగిని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున భోగి మంటలు పెట్టారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల ముగ్గులు వేయడంలో పోటీపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, గ్రామాల్లోనీ వాకిళ్లన్నీ రంగు రంగుల ముగ్గులతో నిండిపోయాయి. సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రేగుపళ్ళు ఉంచారు. పలు చోట్ల ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. గంగిరెద్దుల ఆటలతో పల్లెల్లో కోలాహలం నెలకొంది. పట్టణంలోని రాంనగర్‌లో గంగిరెద్దులు విన్యాసం చేశాయి. ఇంటి యజమానులకు దండం పెట్టించడం, ఆటలాడటం చేయించారు. ఈ సందర్భంగా వారు కానుకలు సమర్పించుకున్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణం నిర్వహించారు.

వనపర్తిలో..

భోగి పండుగను వనపర్తి ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ముగ్గులు వేసి, రంగులు అద్దారు. భోగి మంటలు వేశారు. పిండి వంటలు చేసుకుని ఆరగించారు. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేశారు. పండుగ సందర్భంగా సందడిగా గడిపారు.

గద్వాలలో..

మకర సంక్రాంతి సందర్భంగా తొలి రోజు భోగి పండుగను గద్వాల జిల్లా ప్రజలు శనివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇళ్లముందు ముత్యాల ముగ్గులు వేశారు. చెడు దృష్టి తొలిగిపోతుందని మహిళలు తమ పిల్లల తలలపై రేగి పళ్లను పోశారు. నువ్వులతో సజ్జ రొట్టెలు, అన్ని కూరగాయలు కలిపి చేసిన వంటలు తిన్నారు. భోగి మంటలు వేశారు.

నారాయణపేటలో..

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలను ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులను వేశారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు, రేగి పళ్లను ఉంచారు. ముత్తయి దువలు వాయినాలు ఇచ్చిపుచ్చు కున్నారు. చిన్నారులు హుషారుగా పతంగులను ఎగుర వేశారు. సజ్జలతో చేసిన నువ్వుల రొట్టెలు, అన్ని కూరగాయలతో కూర, పొంగల్‌ చేసుకుని తిన్నారు. తీపి వంటకాలను ఆరగించారు.

నాగర్‌కర్నూల్‌లో..

నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం భోగి వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. అచ్చంపేటలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు కుటుంబ సభ్యులతో తన నివాసంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల గోదాదేవి కల్యాణాన్ని నిర్వహించారు.

పతంగులు ఎగుర వేసిన మంత్రి

మహబూబ్‌నగర్‌: సంక్రాంతి సంబురాలలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన పతంగుల పండుగలో ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ చిన్నారులతో కలిసి పతంగులు ఎగుర వేశారు. పతంగులు ఎగురవేస్తూ అక్కడికి వచ్చిన వారిని ఉత్సాహ పరిచారు. చిన్నారులతో పతంగులు ఎగువేయించారు. పతంగుల పండగను వీక్షించేందుకు వీల్‌ చైర్‌లో వచ్చిన దివ్యాంగుడి వద్దకెళ్ళి అతనితో పతంగి ఎగుర వేయించారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాలను వెలిగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్రాంతికి పతంగులు ఎగురవేయడం ఆనవాయితీ అని చెప్పారు. సంస్కృతి, ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేసి నీటిని నింపడం వల్ల రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పండుగ విశిష్ఠతను తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలన్నారు. జిల్లా ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహమాన్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ చెరుకుపల్లి రాజేశ్వర్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-14T23:22:12+05:30 IST