కార్మికుల వల్లే సంఘం లాభాల బాట
ABN , First Publish Date - 2023-09-22T22:55:24+05:30 IST
చేనేత కార్మికులు కష్టపడితేనే సంఘం లాభాల బాట పడ్తుందని రాజోలి చేనేత సహకార ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు దోత్రె నారాయణ అన్నారు.
- రాజోలి చేనేత సంఘం అధ్యక్షుడు దోత్రె నారాయణ
- 72వ వార్షిక సర్వసభ్య సమావేశం
రాజోలి, సెప్టెంబరు 22 : చేనేత కార్మికులు కష్టపడితేనే సంఘం లాభాల బాట పడ్తుందని రాజోలి చేనేత సహకార ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు దోత్రె నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని రాజోలి చేనేత సహకార సంఘంలో శుక్రవారం 72వ వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మార్కెట్‌లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండు ఉందని, వ్యాపారం ఎంత ఎక్కువగా జరిగితే, సంఘం అంత లాభాల్లో ఉంటుందని చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న నష్టాలను అధిగమించాలన్నా, చేనేత సహకార సంఘం అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే సాధ్యమవుతుం దని తెలిపారు. సంఘంలో షేర్లు ఉన్న సభ్యులు కూడా అందుకు కృషి చేయాలని, చేనేత వస్త్రాల ఉత్పత్తి పెంచితేనే సంఘం మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. సంఘానికి ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రుణాల మాఫీతో పాటు, సహకార సంఘంలో తీసుకున్న అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. అంతకు ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సంఘం వాటా సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సభ్యులు మాట్లాడుతూ దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరారు. ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రయత్నం చేసి, సంఘం అభివృద్ధికి చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మేనేజర్ బటికిరి శ్రీనివాసులు గత ఐదేళ్లలో సంఘం లాభనష్టాల పట్టికను చదివి వినిపించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దోత్రె శ్రీనివాసులు, మహేశ్వరమ్మ, మల్లమ్మ, తాయప్ప, మాబూ, రాజోలి ఉప సర్పంచు గోపాల్, చేనేత సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.