సీఎంకు బుద్ధి చెప్పండి

ABN , First Publish Date - 2023-06-02T23:26:18+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలో కొనసాగింది.

సీఎంకు బుద్ధి చెప్పండి
మాట్లాడుతున్న మల్లు భట్టివిక్రమార్క

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్‌

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

బల్మూరు, జూన్‌ 2: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలో కొనసాగింది. బల్మూరు నుంచి మైలారం గ్రామ స్టేజీ వరకు యాత్ర చేశారు. పాదయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన చేస్తూ, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం సాధిస్తే వేల ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు భావించగా, నేడు వారికి నిరాశే ఎదురైందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో ఇల్లులేని వారికి ఇళ్లు మంజూరు చేశామని, సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టామని చెప్పారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నాయకులు తామే నీళ్లిచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాటి కళాకారులు, ఉద్యోగులు, ప్రజలు, యువకులు నేడు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. పోరాడితే పోయేదేమీ లేదన్నారు. 2023-24 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే రెండు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌ దోపిడీకి పాల్పడుతున్న బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయాలని అన్నారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ పాదయాత్రలో ఎన్నో సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఐదు నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి బుద్ది చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బల్మూరు మండలంలో దాదాపు 500 ఎకరాలకు నాడు సాగునీరు అందిందన్నారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హయాంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు, చెన్నకేశవ ప్రాజెక్టు అంటూ రాజకీయ అవగాహన లేని బాలరాజు ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. బాలరాజుకు, ముఖ్యమంత్రికి బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాంప్రసాద్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు జంగయ్య, కాశన్నయాదవ్‌, ఖదీర్‌, నర్సింగరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:26:18+05:30 IST