పాలక మండలి ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2023-05-31T22:42:02+05:30 IST

అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది, దక్షిణకాశీగా ప్రఖ్యాతి గాంచిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల పాలక మండలి బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది.

పాలక మండలి ప్రమాణ స్వీకారం
పాలకమండలి సభ్యులతో ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌, ప్రజాప్రతినిధులు

- అలంపూర్‌ ఆలయ కమిటీ చైర్మన్‌గా కోనేరు కృష్ణయ్య

- అమ్మవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించిన సభ్యులు

- హాజరైన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్‌

అలంపూర్‌ చౌరస్తా/అలంపూర్‌ మే 31 : అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవది, దక్షిణకాశీగా ప్రఖ్యాతి గాంచిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల పాలక మండలి బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మొదట వారందరూ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి గర్భగుడి ముందు పాలక మండలి సభ్యులుగా కోనేరు గ్రామానికి చెందిన బోయ కృష్ణయ్య, వెంకటనారయణరెడ్డి, చంద్రకళ, సత్యనారాయణ, వెంకటేశ్వరరెడ్డి, బోయ సత్యన్న, గొల్లకృష్ణ, అడివప్ప, రంగు ధనుంజయ, రమేష్‌బాబు, సురేఖ, చాకలి వెంకటేశ్వర్లు, అంపయ్య, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా ఆనంద్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పాలక మండలి చైర్మన్‌గా కోనేరు బోయ కృష్ణయ్య పేరును సభ్యులు వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళ ప్రతిపాదించారు. అందరూ ఏకగ్రీవంగా అమోదం తెలపడంతో చైర్మన్‌ ఎంపిక లాంఛనంగా ముగిసింది. సభ్యులందరికీ ఆలయ ఈవో పురేందర్‌ శాలువలు కప్పి సన్మానించి, తీర్థ ప్రసాదాలను అందించారు.

భక్తుల మన్ననలు పొందాలి : చల్లా వెంకట్రామిరెడ్డి

జోగుళాంబ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావించాలని, భక్తులకు సౌకర్యాల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించి, భక్తుల మన్ననలు పొందాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నూతన పాలకమండలి సభ్యులకు సూచించారు. ప్రమాణ స్వీకారం ఆనంతరం పుష్కరఘాట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లడారు. 25 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తున్న కృష్ణయ్యను ముఖ్య మంత్రి కేసీఆర్‌ గుర్తించి చైర్మన్‌ పదవికి ఎంపిక చేశారని తెలిపారు. ఆలయ ప్రాముఖ్యతను నలుమూలలా చాటేందుకు ఆనాడు కృష్ణా పుష్కరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పిలిచామని తెలిపారు. దాని వల్ల ఆలయ అభివృద్ధి సాధ్యమైందని మందా జగన్నాథ్‌ అన్నారు. పాలకమండలి సభ్యులందరూ న్యాయబద్ధంగా విధులను నిర్వర్తించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. సభాధ్యక్షుడు ప్రోటోకాల్‌ పాటించాలని, అది తెలియకపోతే మైక్‌ వదిలి వెళ్లిపోవాలని సరిత చురకలంటించారు. ఆనంతరం ఆమె జిల్లా కేంద్రంలో పని ఉందంటూ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కల్గడం, తాను చేసుకున్న పుణ్యమని నూతన చైర్మన్‌ కోనేరు కృష్ణయ్య అన్నారు. అనంతరం నూతన చైర్మన్‌ కోనేరు కృష్ణయ్యను ఐక్య వాల్మీకి పొరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు క్యాతూరు మద్దిలేటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరితలకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రామనాయుడు, మాజీ సర్పంచు కృష్ణయ్య, పుల్లూరు శివన్న, పైపాడు శ్రీనివాసులు, జగన్‌మోహన్‌నాయుడు, తిరుమలేష్‌ తది తరులు పాల్గొన్నారు.

మాజీలకు పిలుపేదీ?

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీలను ఎందుకు పిలవలేదని ఆలయ మాజీ ధర్మకర్త బోరవెళ్లి వెంకటేష్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గతంలో ఆలయ కమిటీలో ఉన్న వారిని పిలిస్తే, తమ అనుభవాలు తెలిపే ఆవకాశం ఉంటుంది కదా అన్నారు. మాజీ చైర్మన్లనుకూడా పిలువలేదని, ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-05-31T22:42:02+05:30 IST