Share News

సర్వత్రా ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-12-02T22:56:38+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు ఆదివారం తేలనున్నాయి. ఈసారి ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు సాగడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.

సర్వత్రా ఉత్కంఠ
గద్వాల పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్‌

ఎమ్మెల్యేలెవరో తేలేది నేడే

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఐదు జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు

రౌండ్‌ రౌండ్‌కు ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు

ఉదయం ఎనిమిది గంటలకే లెక్కింపు ప్రారంభం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు ఆదివారం తేలనున్నాయి. ఈసారి ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లు సాగడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎగ్జిట్‌ పోల్స్‌, మరోవైపు పార్టీల అంతర్గత అంచనాలతో ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లాలోని 14 సీట్లకు గాను 11 స్థానాల ఓట్ల లెక్కింపునకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌లలో కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది.

ఉదయం ఎనిమిది నుంచే ప్రారంభం

ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రతీ టేబుల్‌కు ప్రతీ అభ్యర్థి తరఫున ఒకరు కౌంటింగ్‌ ఏజెంటుగా నియమతులయ్యారు. వీరంతా ఉదయం ఐదున్నర గంటలకే కౌంటింగ్‌ కేంద్రం వద్ద రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు ఉదయం ఆరు నుంచే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు. తొలుత ఈవీఎంలను అత్యంత సెక్యూరిటీ నడుమ కౌంటింగ్‌ టేబుల్స్‌ వద్దకు తెస్తారు. తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి ప్రకటిస్తారు. అనంతరం రౌండ్ల వారీగా కౌంటింగ్‌ కొనసాగనుంది.

మొదటి లెక్కింపు పోస్టల్‌ బ్యాలెట్లే

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా ఎనిమిది టేబుల్స్‌ ఏర్పాటు చేయగా, మిగిలిన చోట్ల రెండు టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేశారు.

ఒక్కో టేబుల్‌ వద్ద నలుగురు అధికార సిబ్బంది

ప్రతీ టేబుల్‌ వద్ద ఎన్నికల సంఘం ఆమోదం పొందిన ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు సహాయ సూపర్‌వైజర్లతో పాటు మరో మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. వీరితో పాటు ప్రతీ అభ్యర్థి తరఫున ఒక కౌంటింగ్‌ ఏజెంటు ఉంటారు.

ఫలితాల వెల్లడికి మీడియా సెంటర్‌ ఏర్పాటు

ప్రతీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించేందుకు వీలుగా మీడియా పాయింట్‌ ఏర్పాటు చేసినట్లు పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యూ.వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాలల్లో ఈసెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యాక రిటర్నింగ్‌ అధికారి ఆమోదించిన వెంటనే ఆ ఫలితాన్ని డిస్‌ప్లే చేస్తామని తెలిపారు.

తొలి ఫలితం నారాయణపేటదే

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అతి తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసిన నారాయణపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపు త్వరగా ముగియనుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్ధులు మాత్రమే బరిలో ఉన్నారు. ఇక్కడ 270 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, 1,81,708 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, 11:30 గంటల లోపు ఫలితం వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అత్యధికంగా 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గ ఎన్నికల ఫలితం సాయంత్రం వచ్చే అవకాశముంది. 20 మంది బరిలో నిలిచిన గద్వాల నియోజకవర్గ ఫలితం కూడా ఆలస్యమవుతుందని సమాచారం.

Updated Date - 2023-12-02T22:56:39+05:30 IST