‘తొలిమెట్టు’తో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2023-07-21T00:22:12+05:30 IST

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు గత విద్యా సంవత్సరం ప్రవేశపెట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరంలో రెండోవిడత ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి విద్యాశాఖ దృష్టి సారించింది.

‘తొలిమెట్టు’తో సత్ఫలితాలు
నారాయణపేట పళ్ల ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు

నారాయణపేట, జూలై 20 : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు గత విద్యా సంవత్సరం ప్రవేశపెట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ విద్యా సంవత్సరంలో రెండోవిడత ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి విద్యాశాఖ దృష్టి సారించింది. హైదరాబాద్‌లో ఇటీవలే నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయ నిపుణులు హాజరయ్యారు. దశల వారిగా మండల స్థాయిలో ఆర్పీలు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల వారిగా 66 మంది మండల ఆర్పీలకు, 1,170 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా 513 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 63 వేల పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ‘తొలిమెట్టు’ అమలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 424 ఉండగా, 32,879 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠ్య పుస్తకం ఆధారంగా బోధించడంతో పాటు మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధనకు అవసరమైన అంశాలను ఐదు రోజుల బోధన అనంతరం ఒక్కరోజు పరీక్ష నిర్వహిస్తారు. ఈ వివరాలను టాంజరింగ్‌ యాప్‌లో నమోదు చేస్తారు. పిల్లల భాగస్వామ్యంతో స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఈసారి ప్రత్యేకంగా పిల్లలకు మూడు వర్క్‌ బుక్‌లను అందించ నున్నారు. అలాగే చక్కగా బోధించేందుకు ప్రతీ ఉపాధ్యాయుడికి హ్యాండ్‌బుక్‌ను ఇస్తారు. ఇందులో రూపొందించిన ప్రణాళిక ప్రకారం బోధించాల్సి ఉంటుంది. దశల వారిగా ఆర్పీలు, ఉపాధ్యాయులకు శిక్షణ అనంతరం ఆగస్టు మొదటి వారం నుంచి తరగతి గదిలో విద్యార్థులకు ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

Updated Date - 2023-07-21T00:22:12+05:30 IST