సర్వతోముఖాభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2023-08-16T00:30:28+05:30 IST

ప్రతీ పౌరుడు జాతి అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేసి దేశ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌ అన్నారు.

సర్వతోముఖాభివృద్ధికి కృషి
జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న ఉపసభాపతి పద్మారావు, మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్‌

- అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌

- పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ

- గౌరవవందనం సమర్పించిన పోలీసు బలగాలు

- అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

గద్వాల క్రైం, ఆగస్టు 15 : ప్రతీ పౌరుడు జాతి అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేసి దేశ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు గౌడ్‌ అన్నారు. 77వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల కవాతును తిలకించి, గౌరవ వందనం స్పీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వతోముఖావృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు.

2.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలో 2023-24 సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 3,90,325 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2,14,143 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని ఉప సభావతి తెలిపారు. రైతుబంధు పథకం 11వ విడతలో ఈ వానాకాలంలో 1,52,147 మంది రైతుల ఖాతాల్లో రూ. 161.23 కోట్లు నేరుగా జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో రైతు బీమా పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2,802 మంది రైతు కుటుంబాలకు రూ. 140.10 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 2023-24లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 525 మంది రైతులు 1.335 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటలను సాగు చేసినట్లు తెలిపారు. సూక్ష్మ సేద్య పథకం ద్వారా 259 హెక్టార్ల విస్తీర్ణంలో 172 మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. 2022-23 రబీ సీజన్‌లో 43 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,670 మంది రైతుల నుంచి 36,814 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో రూ.75,83 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.

వంద శాతం సబ్సిడీతో 69 లక్షల చేపపిల్లలు

ఈ ఏడాది వందశాతం సబ్సిడీతో కోటి 69 లక్షల చేపపిల్లలను 375 నీటి వనరులలో వదిలామని ఉప సభావతి టి.పద్మారావు గౌడ్‌ అన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 5,96,946 గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించినట్లు చెప్పారు. 17,588 ఆవులకు, గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. 1,45,780 గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చినట్లు చెప్పారు. హరితహారం తొమ్మిదవ విడత కార్యక్రమంలో భాగంగా ఆటవీ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల 10 వేల ముక్కలను నాటి, సంరక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. గద్వాల, అలంపూర్‌ శాసనసభ నియోజవర్గాలలోని 319 ఆవాసాలు, నాలుగు మునిసిపాలిటీల్లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా పథకాన్ని చేపట్టి పూర్తి చేసిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా 347 కొత్త వోహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, 1444,40 కిలీమీటర్ల పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి, 1,41,529 నల్లా కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులందరికీ రాగి జావ

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు ఉదయం వేళల్లో బలవర్ధక పోషకాలున్న రాగిజావను అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి 134 రకాల పరీక్షలు చేసినట్లు చెప్పారు. రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేసి ఐదు రకాల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 12,591 మంది గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. సార్వత్రిక వ్యాధి నివారణ కార్యక్రమాలలో భాగంగా 3,278 మంది శిశువులకు సంపూర్ణంగా టీకాలు వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 6,624 మందికి కేసీఆర్‌ కిట్లు ఇచ్చినట్లు చెప్పారు. ధరణికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో 57,717 స్లాట్లు నమోదు చేసినట్లు, అందులో 56,030 స్లాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. అలాగే పంచాయితీరాజ్‌, ఇంజనీరింగ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి, మునిసిపల్‌ తదితర శాఖల పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే విన్యాసాలు అకట్టుకున్నాయి.

మీకు పొలం ఉందా... ఈ పనిముట్లు వాడుతున్నారా?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఉపసభాపతి, ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ దగ్గరకు వెళ్లిన ఆయన, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్‌ డ్రమ్‌ సీడర్‌ గురించి ఉపసభాపతికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ‘నీకు పొలం ఎంత ఉంది, ఈ పనిముట్లు వాడుతున్నావా, ఇలాంటి పనిముట్లు ఎంత మందికి పంపిణీ చేశారు’ అని ఆరా తీశారు. ఇందుకు గోవింద్‌ నాయక్‌ మాట్లాడుతూ తాను పొలంలో వాడుతున్నానని, ఇప్పటివరకు 22 మందికి డ్రమ్‌ సీడర్లు ఇచ్చామని తెలిపారు. అనంతరం వరిపొలాల్లో ఎరువులు, పురుగు మందులు చల్లే డ్రోన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాసులు, అపూర్వ చౌహాన్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ శ్రీధర్‌గౌడు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-16T00:30:28+05:30 IST