మహిమగల దివ్యక్షేత్రం సింగోటం

ABN , First Publish Date - 2023-01-05T23:58:24+05:30 IST

మహిమగల సింగోటం లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మహిమగల దివ్యక్షేత్రం సింగోటం
సింగోటం లక్ష్మీనారసింహుడి ఆలయ ముఖ ద్వారం

15 నుంచి లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు

అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

రాష్ట్ర నలుమూలల నుంచి తరలి రానున్న భక్తులు

కొల్లాపూర్‌, జనవరి 5 : మహిమగల సింగోటం లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 16వ తేదీ రాత్రి 8 గంటలకు లక్ష్మీనారసింహుడి కల్యాణోత్సవం, 17వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రభోత్సవం, 18వ తేదీ రథోత్సవం జరుపనున్నారు. రథోత్సవానికి తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరై తమ మొక్కులు చెల్లించుకుంటారు. 19వ తేదీ రోజు రాత్రి 7గంటలకు తెప్పోత్సవం, 20వ తేదీ రాత్రి శేషవాహన సేవ, 21వ రోజు సాయంత్ర 6గంటలకు హంస వాహన సేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం 20 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కే.సుధాకర్‌లాల్‌ జాతరలో నిత్యం వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని వసతులు కల్పిస్తాం : ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

సింగోటం లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలపై జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షా నిర్వహించిన ఆయన బ్రహ్మోత్సవ ప్రాంగణంలో భక్తులకు తాగునీరు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-01-05T23:58:26+05:30 IST