నైపుణ్యానికి పదును
ABN , Publish Date - Dec 20 , 2023 | 10:53 PM
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఆరు నుంచి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- ఆరు నుంచి తొమ్మిది తరగతులకు ‘ఉన్నతి’ అమలు
- విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దడడమే లక్ష్యం
నారాయణపేట, డిసెంబరు 20 : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఆరు నుంచి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఉన్నతి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 24 నుంచి నవంబరు 3వ తేదీ వరకు విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టులు నిర్వహించారు. నెల వారిగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బోధనతో పాటు సాధన కోసం పిరియడ్ల వారిగా బోధిస్తూ విద్యార్థుల నుంచి ప్రాక్టిస్ చేయిస్తున్నారు. అదే విధంగా గ్రంథాలయం ద్వారా విద్యార్థుల్లో పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలో ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇన్‌స్పైర్ జవహార్ నెహ్రూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు వంటివి ఏటేటా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం కావడంతో ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అందిస్తున్నారు. సులభమైన పద్దతుల్లో బోధన అందించేందుకు ఉపాధ్యాయులను సైతం భాగస్వామ్యం చేస్తూ టీచర్స్ ఇన్నోవేషన్ రెపోసిటరి (టీఐఆర్) పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఐఆర్ పోర్టల్‌ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, తమ ఆలోచనలను సబ్జెక్టుల వారిగా సులభమైన పద్దతుల్లో ప్రయోగాలను తయారు చేసి పొందు పరుస్తున్నారు. ఈ విధానంతో తోటి ఉపాధ్యాయులు కూడా చూసి మెరుగైన బోధన అందించేందుకు దోహదపడుతోంది. కాగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 334, ప్రాథమి కోన్నత పాఠశాలలు 84, ఉన్నత పాఠశాలలు 76, కేజీబీవీలు 11, రెండు మోడల్ స్కూల్స్, ఆరు ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్, ఒకటి ఎస్టీ వెల్ఫేర్, మూడు బీసీ వెల్ఫేర్, రెండు మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరుగురు, జడ్పీ హెచ్‌ఎస్‌లో 70 మంది, కేజీబీవీలో 11 మంది, మోడల్ స్కూల్స్‌లో ఇద్దరు, యూపీఎస్‌లో ఒకరు, ఎంపీ యూపీఎస్‌లో 86 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొంది పర్యవేక్షిస్తున్నారు.