ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
ABN , First Publish Date - 2023-09-21T23:49:34+05:30 IST
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

- ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నారాయణపేట/దామరగిద్ద సెప్టెంబరు 21 : ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జి నర్సింహ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తెలంగాణాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. 2014, 2019 ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై హామీలు ఇచ్చి మాదిగలను మోసం చేశారని ఇప్పటికైనా ఆయా పార్టీల నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అజీజ్ ఖాన్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి కళ్యాణ్, నాగేష్, సత్యనారాయణ మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టకపోతే సుధీర్ఘంగా పోరాటం చేసేందుకు సైతం వెనుకాడబోమన్నారు. ఆయా సంఘాల నాయకులు కర్రెప్ప, నర్సిములు, బాలు, రంగప్ప, రాము, మల్లేష్, వెంకటేష్, కురుమూర్తి, ప్రభు పాల్గొన్నారు. అదే విధంగా దామరగిద్ద మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు జిర్గల్ నగేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జీకే వెంకటప్పమాదిగ, బర్ల ఆనంద్‌మాదిగ, పెద్దింటి శ్రీనివాస్‌మాదిగ, లక్ష్మప్పమాదిగ, గోపాల్ మాదిగ, చిన్నశ్రీను మాదిగ, వెంకటప్ప మాదిగ పాల్గొన్నారు.