పంచాయతీలకు నిధులు విడుదల

ABN , First Publish Date - 2023-05-26T22:52:48+05:30 IST

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. దీంతో పెండింగ్‌ ఉన్న చెక్కులు, బిల్లులు డ్రా అవుతున్నాయి.

పంచాయతీలకు నిధులు విడుదల
కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

- ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.13.11కోట్లు

- క్లియర్‌ అవుతున్న చెక్కులు

గద్వాల, మే 26 : గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. దీంతో పెండింగ్‌ ఉన్న చెక్కులు, బిల్లులు డ్రా అవుతున్నాయి. చేసిన పనులకు చాలా రోజుల తర్వాత బిల్లులు చేతికి రావడంతో సర్పంచులు సంతోషం వ్వక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధుల నుంచి చెల్లిం పులు జరుగుతున్నాయి. అలాగే గురువారం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల అవుతు న్నాయి. దీంతో వీటి ద్వారా చేసిన పనులకు సంబం ధించిన బిల్లులు ఒక్కొక్కటిగా డ్రా అవుతున్నాయి. గ్రామ పంచాయతీ ఖాతాల్లో గత డిసెంబర్‌ నుంచి డబ్బులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. గతంలో విడుదలైన ఎస్‌ఎఫ్‌సీ, సాధారణ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించకుండా విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్‌ కంతులు, మల్టీపర్సస్‌ వర్కర్ల జీతాల చెల్లింపులకు పంచాయతీ కార్యదర్శులు వినియోగిస్తూ వచ్చారు.

అభివృద్ధి పనులకు అప్పులు

ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందన్న విశ్వాసంతో సర్పంచులు అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. తీరా గత డిసెంబర్‌లో రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులు విడుదల కాకపోవడంతో సర్పంచు లు దిక్కుతోచని స్థితికి చేరారు. అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వంపై బహిరంగంగానే విమర్శలు మొదలు పెట్టారు. గ్రామ సర్పంచులు పడుతున్న ఇబ్బందులను అవస్థ లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేసింది. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధులపై గత డిసెంబర్‌లో పెట్టిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయడంతో మూడు రోజుల నుంచి బిల్లులు, చెక్కులు క్లియర్‌ అవుతున్నాయి. గత డిసెంబర్‌కు సంబంధించిన నిధు లు రూ.3 కోట్లు, ఇప్పుడు కొత్తగా ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.5 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.11 కోట్లు విడుదల కావడంతో జిల్లాలో రూ.13.11 కోట్ల నిధులు గ్రామ పంచాయతీలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు పోను, కొత్త పనులకు కూడా నిధులు అందుబాటులోకి వస్తాయని జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్‌సుందర్‌ తెలిపారు.

Updated Date - 2023-05-26T22:52:48+05:30 IST