సంక్షేమ తెలంగాణ సాకారం

ABN , First Publish Date - 2023-06-03T00:20:10+05:30 IST

ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి.. స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ తెలంగాణ సాకారం
జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

తొమ్మిదేళ్ల పాలనలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

ప్రభుత్వ ప్రాధాన్యాలుగా విద్య, వైద్యరంగాల అభివృద్ధి

సాగునీటి వనరుల పెరుగుదలతో అన్నిరంగాల్లో మార్పులు

రానున్న రోజుల్లో దేశంలోనే ఆగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి.. స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గడిచిన తొమ్మి దేళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైందని, సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తున్నామని ఆయన తెలి పారు. వనపర్తి జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడితే నష్టపోతామని అవహేళన చేసిన దశ నుంచి దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రంగా.. అభివృద్ధిలో మోడల్‌గా నిలిచిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని అన్నారు. జిల్లా ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం అవసరమైన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకూ పెద్దపీట వేశామని అన్నారు. సాగునీటి వనరుల పెరుగుదలతో అన్ని రంగాల్లో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. ఇప్పటివరకు 1,64,479 మంది రైతులకు రైతుబంధు పథకం కింద నగదు పంపిణీ చేశామన్నారు. 2,743 కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 137.15 కోట్లు అందజేశామని తెలిపారు. రైతువేదికలు, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు రుణమాఫీ వంటి పథకాలతో దేశంలోనే రైతు ప్రభుత్వంగా తెలంగాణకు పేరు నిలిచిందని తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జాతీయ వంట నూనెల మిషన్‌ కింద 1,027 మంది రైతులకు చెందిన 1,823.3 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటించామన్నారు. అంతర పంటల రాయితీ కింద రూ. 1.68కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయలో జిల్లాలో 911 చెరువులను అభివృద్ధి చేసిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఏదుల వద్ద 6.5 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించామని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఘనపూర్‌ బ్రాంచ్‌ కెనాల్‌, పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌, బుద్ధారం కుడి కాలువ, కర్నెతండా ఎత్తిపోతల పథకం, వెల్టూరులోని గోపాల సముద్రం రిజర్వాయర్‌ పనులు చేపట్టామని, ప్యాకేజీ 29లో డీ1, డీ5, డీ8, కాలువల నిర్మాణం ద్వారా 39618 అందిస్తున్నామని తెలిపారు. ఖాన్‌ చెరువుకు నీరు, ఘనపసముద్రం రిజర్వాయర్‌, బుద్ధారం పెద్దచెరువు రిజర్వాయర్‌ రూ. 92 కోట్లు కేటాయించా మని అన్నారు. జిల్లాలో 20 చెక్‌డ్యాంలు మంజూరైతే.. 16 చెక్‌ డ్యాంలు పూర్తిచేసి.. రూ. 23.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో 201 గొర్రెలకాపర్ల సంఘాలకు గొర్రెలు పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో 11,961 యూ నిట్లకు గొర్రెలు పంపించనున్నామని తెలిపారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించి.. 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేశామని తెలిపారు. వనపర్తిలో క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ కేంద్రం, పాలియేటీవ్‌ కేంద్రం, క్రిటికల్‌ కేర్‌, ట్రామాకేర్‌, నియోనాటల్‌ కేర్‌ సదుపాయాలు వచ్చాయన్నా రు. వనపర్తి మునిసిపాలిటీలో టీయూఎఫ్‌ఐడీసీ, పట్టణ ప్రగతి నిధుల నుంచి మురుగు కాలువల నిర్మాణం, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, జంతువుల సంరక్షణ కేంద్రం, పార్కుల సెంట్రల్‌ లైటింగ్‌, మీడియన్‌ ప్లాంటేషన్‌, అమ్మచెరువు, తాళ్ల చెరువు సుందరీకరణ పనులు చేపట్టామని అన్నారు. అన్ని మునిసిపాలిటీల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు రూ. కోట్లలో ఖర్చు చేశామన్నారు. విద్యాశాఖ కింద మన ఊరు- మన బడి పథకం కింద వసతుల కల్పన, తద్వార విద్యార్థుల నమోదు, ఉత్తమ విద్యను అందించేందుక సంకల్పించామన్నారు. గురుకులాలు, కేజీవీబీలు ఏర్పాటు చేసి.. విద్యను పేదలకు చేరువ చేశామన్నారు. జిల్లా అభివృద్ధి పథంలో నిలుపుటకు ప్రతీ ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేసి.. సహకరించాలని కోరుతూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:20:10+05:30 IST