మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా రవి

ABN , First Publish Date - 2023-01-31T23:04:27+05:30 IST

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా జీ.రవి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల కలెక్టర్‌గా పని చేస్తున్న ఈయన్ను జిల్లాకు బదిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా రవి
కొత్త కలెక్టర్‌ జి.రవి

మహబూబ్‌నగర్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా జీ.రవి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల కలెక్టర్‌గా పని చేస్తున్న ఈయన్ను జిల్లాకు బదిలీ చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్‌గా పని చేస్తున్న ఎస్‌.వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రవి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ధర్మారం. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఆరో తరగతి వరకు వరంగల్‌లోని సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌లో, ఆరు నుంచి 12 వరకు కారుకొండ సైనిక్‌ స్కూల్‌లో చదివారు. వరంగల్‌ ఆర్‌ఈసీలో బీఈ (సివిల్‌ ఇంజనీరింగ్‌) చదివిన ఆయన తొలుత జెన్‌కోలో 2002 నుంచి 2008 వరకు ఏఈగా, ఏడీఈగా పని చేశారు. అనంతరం గ్రూప్‌-1 లో ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాలో తొలుత డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. తర్వాత పాల్వంచ, ఆదిలాబాద్‌, దేవరకొండ ఆర్డీవోగా పని చేశారు. నల్లగొండ డీఆర్‌వోగానూ కొంతకాలం పని చేసి, 2015లో ఐఏఎస్‌గా ప్రమోషన్‌ సాధించారు. జిల్లాల విభజన అనంతరం యాదాద్రి- భువనగిరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్‌ జాయింట్‌ కలెక్టర్‌ సమర్థవంతంగా పని చేసి, 8 ఫిబ్రవరి 2020న జగిత్యాల కలెక్టర్‌గా నియమితులయ్యారు. తాజా బదిలీల్లో మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి కలెక్టర్‌ వరకు అన్ని స్థాయిల్లో సమర్థవంతంగా పని చేసిన అనుభవమున్న జి.రవి మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా రావడం పట్ల ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా రెండు సంవత్సరాల 11 నెలల 27 రోజుల పాటు పని చేసిన ఎస్‌.వెంకట్రావు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. అధికారులు, ఉద్యోగులు, అనధికారులతో ఆత్మీయంగా ఉండేవారు. పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ అంశంలోనే చొరవగా వ్యవహరించి కొలిక్కి తెచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేశారు. 11 మే 2018లో మహబూబ్‌నగర్‌ జాయింట్‌ కలెక్టర్‌గా వచ్చిన వెంకట్రావు జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అప్పటి కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో కలిసి సమర్థవంతంగా పనిచేశారు. అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావంతో 2మే 2019న నారాయణపేట కలెక్టర్‌గా నియమితులయ్యారు. నూతన జిల్లాలో పాలనావిధానాన్ని అమల్లోకి తేవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. తిరిగి 4 ఫిబ్రవరి నుంచి ఈనాటి వరకు మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా సేవలందించారు. ఉమ్మడి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా వెంకట్రావు అయిదు సంవత్సరాల ఎనిమిది మాసాల ఇరవై రోజులు పని చేశారు.

Updated Date - 2023-01-31T23:04:28+05:30 IST