వైభవంగా రథోత్సవం
ABN , First Publish Date - 2023-04-03T22:57:01+05:30 IST
రాష్ట్రంలోనే రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం వేలాది మంది భక్తుల మధ్య రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు జైశ్రీరాం అని నినదిస్తూ రథాన్ని ముందుకు లాగారు.
చారకొండ, ఏప్రిల్ 3: రాష్ట్రంలోనే రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం వేలాది మంది భక్తుల మధ్య రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు జైశ్రీరాం అని నినదిస్తూ రథాన్ని ముందుకు లాగారు. ఎత్తయిన బండల మీదుగా శివాలయం నుంచి ఆలయం వరకు రథాన్ని లాగారు. పూజారులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ముఖద్వారం గుండా గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఆలయ సమీపంలో ముక్కిడి పోచమ్మ, ఆలయం దిగువనున్న మైసమ్మ దేవాలయాల్లో భక్తులు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం అనంతరం భక్తులు మొట్ల దారి వెంట గుట్ట కిందకు దిగి వచ్చారు. ఆలయ సిబ్బంది రామాలయం పడమర దిక్కున ఉన్న గుట్టపై గండదీపం వెలగించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు జరుగకుండా కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో వెల్దండ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ కల్యాణ్‌రావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆలయ చైర్మన్ ఢరం రామశర్మ, ఈవో మల్లెల రఘు, సర్పంచ్ యాతం శారద, ఎంపీపీ గుండె నిర్మల, ఆలయ మేనేజర్ నిరంజన్, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.