భగ్గుమన్న పేదలు

ABN , First Publish Date - 2023-03-25T23:09:18+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గద్వాల పట్టణంలో శనివారం నిర్వహించిన వార్డు సభలు గందరగోళాన్ని సృష్టించాయి. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ కొన్ని వార్డుల్లో పేదలు భగ్గుమన్నారు. సభల కోసం వేసిన టెంట్లును పీకేసి, టేబుళ్లను విసిరేశారు.

భగ్గుమన్న పేదలు
కుంటవీధిలో అధికారులు ఉండగానే టెంట్‌ తొలగించిన దరఖాస్తుదారులు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల అర్హుల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆగ్రహం

టెంట్లు కూల్చేసి, టేబుళ్లను విసిరేసిన దరఖాస్తుదారులు 8 జాబితాల చించివేత

కొన్ని చోట్ల వార్డు సభల బహిష్కరణ

మిగిలిన చోట్ల అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు

గద్వాల, మార్చి 25: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గద్వాల పట్టణంలో శనివారం నిర్వహించిన వార్డు సభలు గందరగోళాన్ని సృష్టించాయి. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ కొన్ని వార్డుల్లో పేదలు భగ్గుమన్నారు. సభల కోసం వేసిన టెంట్లును పీకేసి, టేబుళ్లను విసిరేశారు. గోడలపై ప్రదర్శించిన జాబితాలను చించేశారు. గద్వాల పట్టణంలోని దౌదర్‌పల్లి దర్గా దగ్గర ప్రభుత్వం నిర్మించిన 560 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీకి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 4,200 దరఖాస్తులు రాగా, అన్నింటిపై విచారణ నిర్వహించారు. అందులో అర్హులు, అనర్హుల జాబితాలను సిద్ధం చేశారు. కలెక్టర్‌ ఆదేశం మేరకు ప్రతీ వార్డుకు ఒక అధికారితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి శనివారం 37 వార్డులలో గ్రామ సభలను నిర్వహించారు. ఇందుకోసం ప్రతీ వార్డులో టెంటు వేసి, దరఖాస్తుదారుల అర్హుల, అనర్హుల జాబితాను ప్రదర్శించారు. ఆ జాబితాలను చదివి వినిపించారు. ఎందుకు అనర్హులుగా అయ్యారో తెలుపుతూ.. నోట్‌ కూడా రాశారు. అయితే 34, 37, 25, 23, 15 వార్డులతో పాటు మరికొన్ని వార్డులలో పేదలు తమను ఎందుకు అనర్హుల జాబితాలో పెట్టారంటూ అధికారులను నిలదీశారు. ప్లాట్లు లేవు, ఇండ్లు లేవు, కిరాయి ఇళ్లలో ఉన్న తమను అనర్హుల జాబితాలో పెట్టారంటూ నిలదీశారు. ఇండ్లున్న వారిని అర్హుల జాబితాలో చేర్చారని కొట్లాడారు. 37వ వార్డు సోమనాద్రి నగర్‌ 45 దరఖాస్తులు చేసుకున్నామని, జాబితాలో మీకే మొదట కేటాయిస్తామన్న అధికారులు అందులో నలుగురినే చేర్చారని ఆగ్రహించారు. కోట గోడ కూలినప్పుడల్లా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. కుంటువీధి, తెలుగుపేటలో కూడా పరిస్థితి ఇలానే ఉండగా కోపోద్రుక్తులు అయిన పేదలు టెంట్లను కూల్చి వేశారు. టేబుళ్లను విసిరేయడంతో పాటు ప్రదర్శించిన జాబితాను చించేశారు. చేసేదిలేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపో యారు. మిగిలిన వార్డులలో అనర్హుల నుంచి అభ్యంత రాలను స్వీకరించి, తిరిగి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో చాలా మంది తాము అర్హులమేనని, మరో సారి విచారణ చేయాలని అధికారులను వేడుకున్నారు.

ఇది తుది జాబితా కాదు

కుంటవీధి, తెలుగుపేట, సోమనాద్రినగర్‌ తదితర వార్డులలో పేదలు నిరసనలు తెలుపడంతో గద్వాల తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు స్పందించారు. రెవెన్యూ బృందాలు దరఖాస్తుదారుల ఇళ్లకు వచ్చి పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలను తయారు చేశాయన్నారు. ఇది తుది జాబితా కాదని తెలిపారు. అభ్యంతరాలను తెలి పితే నోట్‌ చేసుకొని పరిశీలిస్తామని తెలిపారు. ఆ తర్వాతనే బహిరంగంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు. దరఖాస్తు దారులు అనుమానాలను పక్కకి పెట్టి అభ్యంతరాలు ఇవ్వాలని సూచించారు.

- తహసీల్దార్‌, వెంకటేశర్లు

Updated Date - 2023-03-25T23:09:18+05:30 IST