మిత్తి మాఫేదీ?

ABN , First Publish Date - 2023-08-04T00:22:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుంటే, మరోవైపు మిగిలి పోయే మిత్తి పరిస్థితి చింత కలిగిస్తోంది. దాదాపు మాఫీ మొత్తానికి సమానంగా మిత్తీలు పెరిగాయని, ప్రభుత్వం ఇప్పుడు రూ.లక్ష మాఫీ చేసినా, రైతుల ఖాతాల మీద దాదాపు ఇంకో రూ.లక్ష వరకు పెరిగిన మిత్తి అలాగే ఉండిపోతోందని వాపోతున్నారు.

మిత్తి మాఫేదీ?

- రుణమాఫీ జాప్యంతో పెరిగిన వడ్డీలు

- అసలుకు సమానంగా పేరుకుపోయిన మిత్తి

- గోల్డ్‌లోన్లనూ మాఫీ చేయాలంటోన్న రైతులు

- తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో మాఫీ కానున్న రూ.2,866.80 కోట్లు

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతుల్లో ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుంటే, మరోవైపు మిగిలి పోయే మిత్తి పరిస్థితి చింత కలిగిస్తోంది. దాదాపు మాఫీ మొత్తానికి సమానంగా మిత్తీలు పెరిగాయని, ప్రభుత్వం ఇప్పుడు రూ.లక్ష మాఫీ చేసినా, రైతుల ఖాతాల మీద దాదాపు ఇంకో రూ.లక్ష వరకు పెరిగిన మిత్తి అలాగే ఉండిపోతోందని వాపోతున్నారు. నాలుగే ళ్లుగా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు 80 శాతం ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రకటించి రైతులకు నోటీ సులు పంపించారు. ఈ పరిస్థితుల్లో వడ్డీలనూ మాఫీ చేసే నిర్ణయం తీసుకుంటే పూర్తి ఉపశమనం కలిగేదనే భావన రైతుల్లో కనిపిస్తోంది. మరోవైపు గోల్డ్‌లోన్లపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు, కవులు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అసలుకు మించిన వడ్డీల భారం

మాఫీ వర్తిస్తుందనే విశ్వాసంతో రైతులు నాలుగేళ్ల నుంచి బ్యాంకుల్లోని పంటరుణాలను చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగిపోయింది. బ్యాంకుల్లో రెగ్యులర్‌గా చెల్లింపుల్లేక పోవడంతో ఆరుమాసాలకోసారి వడ్డీలను అసలుకు జతచేసి, బుక్‌ అడ్జస్ట్‌మెంట్లు చేస్తూ వస్తున్నారని, దీంతో అసలుకు సమానంగా వడ్డీ వచ్చిచేరిందని వాపోతున్నారు. మాఫీ పథకంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్లపాటు కిస్తీల ప్రకారం ప్రతీయేటా 25శాతం రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ ఊరట దక్కలేదు. 2019- 20, 2020-21లలో రూ.25వేల లోపు, ఆ తర్వాత రూ.50వేల లోపు రుణాల మాఫీకి నిధులిచ్చినా ప్రయోజనం దక్కలేదు. తాజాగా మాఫీ అయ్యే మొత్తానికి దాదాపు సమానంగా వడ్డీలు పెరగడంతో రుణమాఫీ చేసినట్లు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడంతో కొత్త రుణాలు పుట్టక రైతులు బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. కౌలురైతులు సైతం పెట్టబడి కోసం గోల్డ్‌లోన్‌ తీసుకున్నారు. గోల్డ్‌లోన్‌ల మాఫీపైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నా రు. ఇప్పుడు మాఫీ చేసిన రూ.లక్ష రుణానికి తోడు వడ్డీమాఫీపైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, కనీసం కౌలురైతులకు సంబంధించిన గోల్డ్‌లోన్లు రద్దుచేయాలనే డిమాండ్‌ వస్తోంది. అప్పుడే రైతులకు రుణవిముక్తి కలగడంతో పాటు, డీఫాల్టర్‌ జాబితా నుంచి తప్పించి మళ్లీ పరపతిరుణాలు పొందే అవకాశం దక్కుతుందనే అభిప్రాయం వెల్లడవుతోంది.

ఉమ్మడి జిల్లాలో అర్హులైన రైతులు 5.23 లక్షల మంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా రుణమాఫీతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5.23 లక్షల మంది రైతులకు గాను రూ.2,866.80 కోట్ల మేర రుణమాఫీ వర్తించ నుంది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో భారీగా రుణమాఫీ జరగనుండగా, నారాయణపేట, వనపర్తి జిల్లాలో కొంత తక్కువ మొత్తంలో మాఫీ దక్కనుంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే ప్రకారం వెనువెంటనే సంబంధిత ఏజన్సీ బ్యాంకులకు రైతుల ఖాతాల ప్రకారం మాఫీ మొత్తాన్ని జమచేస్తామని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.

వడ్డీతో సహా మాఫీ చేయాలి

కేసీఆర్‌ 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల అప్పు వడ్డీతో సహా మాఫీ చేయాలి. నాడు కేసీఆర్‌ లక్ష రూపాయల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలామంది రైతులు రుణాలు రెన్యువల్‌ చేయించుకోలేదు. దీంతో వడ్డీ భారీగా పెరిగింది. ప్రభుత్వ జాప్యం వల్ల పెరిగిన వడ్డీని ప్రభుత్వమే భరించాలి. అందుకోసం వడ్డీతో సహా రుణాలను మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి.

- వెంకోబా, బీకేఎస్‌ రాష్ట్ర జోనల్‌ కార్యదర్శి, నారాయణపేట

Updated Date - 2023-08-04T00:22:25+05:30 IST