నెలాఖరులోపు రుణమాఫీ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-09-21T23:53:10+05:30 IST

నెలాఖరు లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

నెలాఖరులోపు రుణమాఫీ పూర్తి చేయాలి
వ్యవసాయాధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, సెప్టెంబరు 21 : నెలాఖరు లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వ్యవసాయాధికారులతో రైతు రుణమాఫీ 2018పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 45,112 రైతులకు గాను రూ.256 కోట్ల రుణమాఫీ వర్థించనుందని, ఇప్పటికే రూ.131 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. వ్యవసాయాధికారులు గ్రామాల వారిగా జాబితాను సరిచేసి, డబ్బులు జమకాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. అలాగే రైతు బీమాలో నిర్లక్ష్యం వద్దని, రైతులు చనిపోయిన తొమ్మిది రోజుల్లో నామిని ఖాతాల్లో బీమా డబ్బులు జమ చేయాలన్నారు. ఆయిల్‌ ఫామ్‌ రెండు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, ఇంకా 1000 ఎకరాల్లో సాగు దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన అధికారులతో కలిసి రైతుల ద్వారా డీడీలు కట్టించి ఆయిల్‌ పామ్‌ సాగుపై మొగ్గు చూపేలా చూడాలన్నారు. రైతులకు డ్రిప్‌లు అందించాలని ఎరువుల వివరాలను ఈ పాస్‌లో, నిల్వ స్టాక్‌లో వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్‌, ఉద్యానవన అధికారి సాయిబాబు, ఏఈవోలు పాల్గొన్నారు.

పాఠశాల పనులు పరిశీలన

నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో కొనసాగుతున్న తరగతి గదుల నిర్మాణ పనులను కలెక్టర్‌ శ్రీహర్ష పరిశీలించారు. అలాగే పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, వాచ్‌మెన్‌ను నియమించుకోవాలని హెచ్‌ఎం శ్రీనివాసులుకు కలెక్టర్‌ సూచించారు. పాఠశాల ఆవరణలో గ్రాస్‌ను పెంచి మొక్కలు నాటాలని, పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2023-09-21T23:53:10+05:30 IST