కలిసికట్టుగా.. పని చేస్తాం

ABN , First Publish Date - 2023-06-02T23:23:47+05:30 IST

పాలమూరు అభివృద్ధి, అమరుల ఆశయ సాధన కోసం ప్రజాప్రతినిధులు, అధికారులమంతా కలిసి కట్టుగా పని చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

కలిసికట్టుగా.. పని చేస్తాం
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరు ప్రగతి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి

ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

ఘనంగా ప్రారంభమైన తెలంగాణ ద శాబ్ది ఉత్సవాలు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 2: పాలమూరు అభివృద్ధి, అమరుల ఆశయ సాధన కోసం ప్రజాప్రతినిధులు, అధికారులమంతా కలిసి కట్టుగా పని చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతోపాటు అధికారులు, విద్యార్థులు, ప్రజా, కుల సంఘాలు, జర్నలిస్ట్‌లు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్‌ సారఽథ్యంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన వారికి ఎంత గుర్తింపు ఉందో తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన కుటుంబాలకు అదే గౌరవం ఉంటుందని, వారితో సమానమేనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత భవనం ఆవరణలో వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరులకు నివాళ్ళర్పించారు. అనంతరం సమీకృత భవనం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని అన్నారు. ఎంతోమంది ప్రాణాలు అర్పించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానాలకు అనుగుణంగా అధికారులు పని చేయడం వల్ల రాష్ట్రానికి ఏటా 10-20 జాతీయ స్థాయి అవార్డులు వస్తున్నాయన్నారు. 70 ఏళ్ళలో జరగని అభివృద్ధి, ప్రగతి దశాబ్ద కాలంలోనే జరిగిందంటే అది తెలంగాణ ఏర్పాటు వల్లనే, కేసీఆర్‌ సారథ్యం వల్లనే సాధ్యమైందని మంత్రి వెల్లడించారు.

ఐటీ పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు

పాలమూరు సమీపంలోని దివిటిపల్లి వద్ద 371 ఎకరాల్లో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాలమూరుకు బైపాస్‌ పేరుతో ఇన్నాళ్లు టైమ్‌పాస్‌ చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ.100 కోట్లతో బైపాస్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు. భారత్‌మాలకు అడ్డంకులు సృష్టించినా మహబూబ్‌నగర్‌- చించోలి రహదారి వచ్చిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. సమైక్య పాలనలో పెండింగ్‌ ప్రాజెక్టులు నేడు రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మారాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని 13 మండలాల్లో 2.35 లక్షల ఎకరాలకు సాగనీరందుతుందని ఉద్ఘాటించారు. అన్ని వర్గాల వారికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఉత్సవాల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రి, అధికారులు వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ప్రభుత్వ శాఖల ప్రగతిపై ఏర్పాటు చేసిన స్టాళ్ళను మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు తిలకించారు. అంతకుముందు అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించుకున్నారు. వి.మల్లేశ్‌, అనీల్‌కుమార్‌రెడ్డి, బోయచెన్నయ్య కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ జి.రవినాయక్‌, ఎస్పీ కే.నర్సింహులు, అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామారావు, జడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో అనిల్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:23:47+05:30 IST