Share News

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 24 , 2023 | 10:17 PM

కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, ఇరిగేషన్‌ మైనర్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

భూసేకరణ వేగవంతం చేయాలి
సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, డిసెంబరు 24 : కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, ఇరిగేషన్‌ మైనర్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం, జురాల ఎడమ కాల్వ పరిధిలోని గోపాల్‌దిన్నె జలాశయాన్ని కలిపే లింక్‌ కెనాల్‌ పనుల పురోగతి, భూసేకరణపై మంత్రి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పరిధిలోని సింగోటం జలాశయం నుంచి జురాల పరిధిలోని గోపాలదిన్నె జలాశయాన్ని నింపడం ద్వారా దిగువనున్న 35 వేల ఎకరాలకు నీరందించాలని లింక్‌ కెనాల్‌ రూపకల్పన చేశారు. ఈ పనులు కొసాగుతుండడంపై మంత్రి ఆరా తీశారు. భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. భూసేకరణ సమస్యలపై ఇప్పటికైనా నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి చెప్పారు. పరిహారం సంగతి తేలితే పనులు వేగం అందుకునే అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కెనాల్‌ నిర్మాణం వల్ల భూములు కోల్పోతున్న వాళ్లంతా చిన్న సన్నకారు రైతులేనని, వారికి సరైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, కాల్వ పనులు చేపట్టాలన్నారు. ఈ పనులు పూర్తయితే చివరి ఆయకట్టుకు వరకు నీరందుతుందన్నారు. 1,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జిల్దార్‌తిప్ప చెరువు పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. జిల్దార్‌తిప్ప చెరువు నింపడానికి ప్యాకేజీ-30తో పాటు బాచారం, యాపట్ల, మారెడుమాన్‌దిన్నె, జిల్దార్‌తిప్ప గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించే పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నీటి లభ్యత ఉన్న చోట చెరువుల ద్వారా డిస్ట్రిబ్యూటర్‌ కింద పూర్తి స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సాగునీరు అందించాలన్నారు. ప్రధానంగా చెరువుల కింద ఎంత ఆయకట్టు ఉందో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో వాస్తవ వివరాలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ శ్రీనివా్‌సరెడ్డి, సంజీవ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 10:17 PM