పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత
ABN , First Publish Date - 2023-02-21T23:30:20+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న కొంతమంది సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.
- పదోన్నతి శిక్షణలో 40 మంది కానిస్టేబుళ్లు
- గ్రూప్స్ పరీక్షల కోసం సెలవులో మరికొందరు
- గద్వాల పోలీస్ స్టేషన్ స్థాయి పెంపునకు యత్నాలు
గద్వాల క్రైం, ఫిబ్రవరి 21 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న కొంతమంది సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలు ఉండాల్సి ఉంది. కానీ నాలుగు నెలల నుంచి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్లలోనూ సిబ్బంది కొరత నెలకొని ఉంది. దీనికి తోడు వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన 40 మంది కానిస్టేబుళ్లు ప్రమోషన్ కోసం శిక్షణకు వెళ్లారు. వచ్చే నెలలో వీరి ట్రైనింగ్ పూర్తి అవుతుంది. అలాగే జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఐదు నుంచి ఆరుగురి వరకు గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది కొరత మరింత ఎక్కువయ్యింది. జిల్లా కేంద్రంలో దాదాపు 32 మంది సిబ్బంది విధుల్లో ఉండాలి కానీ, 20 మంది మాత్రమే పని చేస్తున్నారు. వారిలో ఆరుగురు ఇతర అధికారిక విధుల్లో ఉన్నారు. ఓ ఏఎస్‌ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు.
అప్‌గ్రేడ్ చేసే దిశగా యత్నాలు
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసే దిశగా ముందడుగు పడుతోంది. ఈ విషయంపై ఇటీవలే ఎస్పీతో పాటు రాష్ట్ర పోలీస్ అధికారులతో చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. గద్వాల పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఎస్‌ఐ ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఉన్న పోలీస్ స్టేషన్‌ను ఎస్‌హెచ్‌వో - సీఐగా మార్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై నేడో, రేపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అప్‌గ్రేడ్ అయితే ఎస్‌హెచ్‌వోగా సీఐ, ఆయన కింద నలుగురు ఎస్‌ఐలు ఉంటారని, సిబ్బంది సంఖ్య కూడా దాదాపు 80 వరకు పెరుగుతుందని తెలిపారు. అలాగే అయిజ, అలంపూర్ స్టేషన్లు కూడా అప్‌గ్రేడ్ అయితే బాగుంటుందన్నారు.
నేరాల నియంత్రణకు కృషి
రంగస్వామి, డీఎస్పీ, గద్వాల : ప్రస్తుతం శిక్షణలో సిబ్బంది వచ్చే నెలలో విధుల్లో చేరనున్నారు. అప్పుడు సిబ్బంది కొరత కొంత మేర తగ్గుతుంది. ఎస్పీ సృజన ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. పట్టణ పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పోస్టులు కూడా పెరుగుతాయి. సిబ్బంది కొరత కూడా తీరుతుంది.