ఖరీఫ్ పంటలు సాగు చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2023-07-21T23:34:41+05:30 IST
ఆశించిన మేర వర్షాలు కురుస్తున్నందున ఖరీఫ్ పంటలు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి రైతులకు సూచించారు.
- జిల్లాలో ఆశించిన మేర వర్షాలు
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, జూలై 21 : ఆశించిన మేర వర్షాలు కురుస్తున్నందున ఖరీఫ్ పంటలు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి రైతులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఐడీవోసీ సమావేశపు హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. విత్తనాలు వెదజల్లే పద్ధతిని అవలంభిస్తే తక్కువ కూలీలతో ఎక్కువ పంట, ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. 2023, జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 23 శాతం తక్కువగా నమోదయ్యిం దన్నారు. జూలైలో 73.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటిరకు 52.8 శాతం కురిసిందని తెలిపారు. గత ఏడాది ఖరీఫ్‌లో 1,75,700 ఎకరాలలో పంటలు సాగయ్యాయని, ఈ ఏడాది జూలై నెలలో గురువారం ఒక్కరోజే 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 83,000 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని తెలిపారు. జూలై 31 వరకు వరి, మొక్కజొన్న, సజ్జలు, రాగి, కొర్రలు, కందులతో పాటు, స్వల్పకాలిక వ్యవఽధిలో పండే వేరుశనగ, ఆముదం, పొద్దు తిరుగుడు, ఎర్రమిరప పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలతో పంట లకు నష్టం వాటిల్లితే కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి సమస్యలు, సందేహాలు వచ్చినా వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవిందునాయక్ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. పాతబడిన ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడా లని పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు. వర్షాకాలంలో పిడుగులు పడే ప్రమాదముందని, ఆ సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండొద్దన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ఓటింగ్ యంత్రాలపై విస్తృత ప్రచారం చేయాలి
ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం మొదటి స్థాయి తనిఖీ పూర్తయిన ఈవీఎంలలో 10 శాతం యంత్రాలను సిబ్బందికి శిక్షణ, ఓటర్లకు అవగాహన కార్యక్రమాలకోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటు వేయడం మన జన్మహక్కు అన్నారు. వినియోగించుకోవడం మన జన్మహక్కు అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడంపై ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఐడీవోసీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల పరిధిలోనూ అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో, అలంపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ వరలక్ష్మి, సురేష్, రఘు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.