మౌలిక వసతులు కల్పించడమే కేసీఆర్ లక్ష్యం
ABN , First Publish Date - 2023-07-21T23:19:42+05:30 IST
తెలంగాణలో మౌలిక వసతులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- విద్యుత్‌పై ఆధారపడి ఆధునిక జీవనం
- సబ్ స్టేషన్ ప్రారంభించిన : మంత్రి
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఖిల్లాఘణపురం/వనపర్తి అర్బన్/ పెబ్బేరు/ పెబ్బేరు రూరల్, జూలై 21: తెలంగాణలో మౌలిక వసతులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మానాజిపేటలో శుక్రవారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పశువైద్యశాల భవనం, రజక కమ్యూనిటీ భవనం, గౌడ సంఘం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నూతన సబ్‌స్టేషన్ ప్రారంభించడంతో 2, 3 గ్రామాలకు లో వోల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. నియోజకవర్గంలో 23 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయగా 15 పూర్తయ్యాయని, మిగిలినవి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్లు పెరగడంతో గ్రామాల్లో రైస్ మిల్లులు పెరుగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి కరెంటు సమస్యలు ఉండవని తెలిపారు. విద్యుత్ సమస్యలు తొలగిపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. కేఎల్‌ఐ కాల్వల తవ్వకాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో నిరుపేద కుటుంబాల వారికి ఇళ్లు కేటాయించాలని మహిళలు మంత్రిని అభ్యర్థించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాన్‌గల్ రోడ్డులో బైక్ మెకానిక్ యూనియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి భూమిపూజ చేశారు. పీర్ల పండుగ సందర్భంగా శుక్రవారం పెబ్బేరు పట్టణంలోని పీర్లచావిడిలో మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పెబ్బేరు పట్టణంలోని కిష్టారెడ్డిపేట సమీపంలోని సరోజిని మల్టీ స్పెషాలిటీ హస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామంలో సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ముంపు నిర్వాసితులకు 150 నుంచి 200 మందికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణ నాయక్, జడ్పీటీసీ సామ్య నాయక్, సర్పంచ్ సతీష్ కుమార్, ఎంపీటీసీ నాగన్న , వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలీశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, నాయకులు పురుషోత్తం, విద్యుత్ డీ ఈ నరేందర్ కుమార్, ఏఈ కొండయ్య, వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు మునిసిపల్ చైర్‌పర్సన్ కరుణశ్రీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు సువర్ణ, రంగదాసు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.