Share News

కొడంగల్‌కి కాడా

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:04 PM

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజక వర్గం కొడంగల్‌ అభివృద్ధికి బాటలు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొడంగల్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కాడా(కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రామకృష్ణా రావు శనివారం జీవో 14 విడుదల చేశారు.

కొడంగల్‌కి కాడా
సీఎంను కలిసిన కొడంగల్‌ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి

కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఇక పరుగులు పెట్టనున్న అభివృద్ధి

త్వరలో మాస్టర్‌ ప్లాన్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజక వర్గం కొడంగల్‌ అభివృద్ధికి బాటలు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొడంగల్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కాడా(కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రామకృష్ణా రావు శనివారం జీవో 14 విడుదల చేశారు. ఈ జీవోఓలో వికా రాబాద్‌, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్‌నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి, సంక్షేమ పథకాల అమలు సవ్యంగా జరిగేందుకు, యువతకు ఉపాధి వనరులు కల్పించేందుకు ఈ అథారిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. వికారాబాద్‌ కలెక్టర్‌ ఈ అథారిటీకి చైర్మన్‌గా ఉంటారు. త్వరలోనే ప్రత్యేక అధికారిని కూడా నియమించనున్నట్లు తెలిపారు. వికారాబాద్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి, అభివృద్ధికి శ్రీకారం చుడతారు.

అథారిటీ లక్ష్యాలు

నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాల అమలు పక్కాగా చేపట్టనున్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, విద్యుద్దీకరణ, వీధిదీపాలు, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తారు. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్థానికులకు జీవనోపాధి అందించే కార్యక్రమాలను అమలు చేస్తారు. విద్య, వైద్యం సదుపాయాలను పెంచి, సామాజిక, సాంఘిక అభివృద్ధికి దోహద పడతారు. సహజ వనరుల పరిరక్షణ ద్వారా భూగర్భ జలాలు వృద్ధికి చర్యలు తీసుకుంటారు. వ్యవసాయం కోసం చెక్‌ డ్యాంలు, చెరువుల సంరక్షణ, భూగర్భ జల సంపద పెంచే చర్యలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఇటు వ్యవసాయానికి, అటు స్థానిక యువతకు ఉపాధి లభించే కార్యాచరణ అమలు చేస్తారు.

సమీక్షించనున్న ప్రణాళిక శాఖ

కాడా అథారిటీ తీసుకునే నిర్ణయాలు, చేపట్టే పనులను ప్రణాళిక శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. అథారిటీకి అవసరమైన సిబ్బంది, ఉద్యోగుల నియామకాలను ప్రణాళిక శాఖ ఆర్థిక శాఖకి నివేదించి చేపడుతుంది. మొత్తంగా రేవంత్‌రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడంతో కొడంగల్‌ నియోజకవర్గానికి మహర్ధశ పట్టినట్లే అని అభిప్రాయం వ్యక్తం మౌతుంది. సీఎంగా ప్రమాణం చేసిన 24 రోజుల్లోనే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్ని పనులు సవ్యంగా సాగితే రాబోయే ఐదేళ్లలో కొడంగల్‌ నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి ఎదుగుతుందని నాయకులు, అధికారులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక అధికారి నియామకం

కోస్గి రూరల్‌: నియోజకవర్గ అభివృద్ధికి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన ఆర్డీవో స్థాయి అధికారి వెంకట్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన శనివారం కొడంగల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడి పరిస్థితులపై ప్రాథమికంగా ఆరా తీశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో సమావేశం అయ్యారు.

Updated Date - Dec 30 , 2023 | 11:04 PM