మాటల మూటలే..

ABN , First Publish Date - 2023-02-06T23:32:16+05:30 IST

‘పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. కొన్ని ప్రతీఘాత శక్తులు ఈ ప్రాజెక్టును కేసులతో అడ్డుకుంటున్నాయి. త్వరలో పర్యావరణ అనుమతులు సైతం సాధించి ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది.

మాటల మూటలే..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌

బడ్జెట్‌ ప్రసంగంలో పాలమూరు గురించి ప్రస్తావించిన మంత్రి హరీశ్‌రావు

తమ ప్రభుత్వం వచ్చాకే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేశామని ప్రకటన

సాగు పెంచడం ద్వారా జిల్లాకే వలస వస్తున్నారని వ్యాఖ్య

పాలమూరు-రంగారెడ్డి సహా జిల్లా ప్రాజెక్టులకు రూ.1638..89 కోట్ల కేటాయింపులు

ఐటీ టవర్‌ ఈయేడాది ప్రారంభిస్తామని వెల్లడి

మహబూబ్‌నగర్‌కు ఇంజనీరింగ్‌ కాలేజీ ఇస్తామని ప్రకటన

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. కొన్ని ప్రతీఘాత శక్తులు ఈ ప్రాజెక్టును కేసులతో అడ్డుకుంటున్నాయి. త్వరలో పర్యావరణ అనుమతులు సైతం సాధించి ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది. నదీ జలాల చట్టం సెక్షన్‌-3ని అనుసరించి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలను తేల్చి ఇవ్వాల్సిందిగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు సూచించాల్సిన కేంద్రం విపరీత జాప్యం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు ఆటంకం కలిగింది. నదీ జలాల విషయం తేల్చకుండా ఇబ్బందిపెడుతోన్న కేంద్ర వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.’ అని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ రావు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల యేడాది ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో పాలమూరు ఉమ్మడి జిల్లా గురించి, ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు, ఇతర పథకాల గురించి హరీశ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పాలమూ రులోని నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, కల్వకుర్తి, భీమా తదితర ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఒకప్పుడు వలసలు, కరువు జిల్లాగా పేరున్న పాలమూరుకే నేడు వ్యవసాయ పనులకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి కల్పించామని చెప్పారు. మొత్తంగా హరీశ్‌రావు చేసిన బడ్జెట్‌ ప్రసంగం, ఇచ్చిన కేటాయింపులు ప్రజల్లో ఆశల్ని సజీవంగా నిలిపితే, ప్రతిపక్షాలు మాత్రం పెదవివిరిచాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా ఇతర ప్రాజెక్టులకు ఆశించిన మేర నిధులు కేటాయించారు. వీటితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చారు. వీటితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జేఎన్‌టీయూ అనుబంధంగా ఇంజనీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఇక్కడి విద్యార్ధుల్లో ఆనందం వ్యక్తమైంది.

నారాయణపేట, గద్వాలల్లో మెడికల్‌ కాలేజీల ప్రస్తావన కరువు

ఉమ్మడి జిల్లాను సందర్శించిన పలు సందర్భాల్లో ఇక్కడి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తిలలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటవగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ సహా, మంత్రులు ప్రకటించారు. అయితే ఈబడ్జెట్‌లో ఆ ప్రతిపాదనలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతులకు మోక్షం

ఈ బడ్జెట్‌లో ఇటు పంచాయతీరాజ్‌శాఖ నుంచి అటు ఆర్‌అండ్‌బీ నుంచి రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల మరమ్మతులకు మోక్షం కలగనుంది. దాదాపు నాలుగేళ్లుగా ఈ నిధుల కేటాయింపులు లేకపోవడంతో గ్రామీణ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిన నేపథ్యంలో ఈ నిధులొస్తే కొంత ఊరట కలగనుంది.

జిల్లా ప్రాజెక్టులకు రూ. 1638.89 కోట్లు

పాలమూరు ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై బడ్జెట్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆర్థిక మంత్రి వాటికి గతేడాది కంటే మెరుగ్గా కేటాయింపులు చేశారు. ప్రతిష్టాత్మకమైన పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కంకణబద్ధతతో పనిచేస్తుందని ప్రకటించడం ద్వారా పాలమూరు ప్రాంత రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు మంత్రి ప్రయత్నించారు.

స్థానిక సంస్థలకు నిధులు నేరుగా అకౌంట్లలోకే..

స్థానిక సంస్థలకు ప్రస్తుతమిస్తున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు, రాష్ట్ర ఆర్థిక సంస్థ నుంచి ఇచ్చే నిధులను కూడా ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా సంబంధిత అకౌంట్లకు వేస్తారని మంత్రి చెప్పారు. దీంతో పాలనాపరంగా సులభ మవుతుందని ప్రకటించారు. ట్రెజరీల్లో బిల్లుల కోసం తంటాలు పడే అవస్థలకు ఈ ప్రతిపాదనలతో చెక్‌పడ నుంది. ఇకపై స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే నిధుల కొరత ఏర్పడే అవకాశమే ఉండదని సర్పంచులు, ముని సిపల్‌ చైర్మన్లు అభిప్రాయప డుతున్నారు.

మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్‌ ఈ యేడాది ప్రారంభం

సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, పెట్టుబడుల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగిందని గణాంకాలతో వివరించిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిర్మాణం దాదాపు పూర్తయిన ఐటీ టవర్‌ని ఈయేడాది ప్రారంభిస్తామని ప్రకటించారు.

నిధుల్లేని రూ.3 లక్షల పథకం

సొంత జాగా ఉన్న వారు ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామనే పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రస్తావించినా నిధులివ్వలేదు. అయితే ఈ సారి ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.7,980 కోట్ల నిధులివ్వడంతో పాటు, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకం కింద 2 వేల ఇళ్లను కేటాయించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ పథకానికి రూ.12 వేల కోట్ల నిధులను బడ్జెట్‌లో కేటాయించారు.

సమప్రాధాన్యం

ఈ బడ్జెట్‌లో ఒకవైపు మౌలిక వసతులకు, మరోవైపు సంక్షేమ పథ కాలకు సమ ప్రాధాన్యత దక్కింది. ఈ రెండింటినీ పరిశీలిస్తే మొత్తంగా సమ్మిళితంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు స్పష్టమవుతోంది. అదేసమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం రాష్ట్ర వృద్ధికి సూచికగా పేర్కొనవచ్చు. అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారని చెప్పవచ్చు.

- డాక్టర్‌ జిమ్మికార్టన్‌, ఆర్థికశాస్త్ర విభాగ మాజీ అధిపతి

జనాకర్షక బడ్జెట్‌

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈబడ్జెట్‌ రూపకల్పన చేసిన విషయం స్పష్టమవుతోంది. విద్యారంగానికి కేటాయించిన నిధులు ప్రక్షాళన, అదనపు హంగులకు సరిపోవు. మన ఊరు-మన బడికి బారీగా కేటాయింపులు చేసినా ఖర్చులో ఏమేరకు ముందుంటారో చూడాల్సి ఉంది. ఎంప్లాయిస్‌ హెల్త్‌ ట్రస్ట్‌ ద్వారా పదవీ విరమణ ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది.

- డాక్టర్‌ రంగప్ప, కామర్స్‌ అధ్యాపకుడు

ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా..

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయిం పులు ఉన్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు పారిశ్రామికరంగ వృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. అన్ని వర్గాలూ బడ్జెట్‌ పట్ల సంతృప్తితో ఉన్నారు. అవరోధాలన్నింటినీ అధిగమించి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.

- డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే

ఒరిగేదేం లేదు

ఎన్నికల కోసమే బడ్జెట్‌లో కేటా యింపులు చేశారు. దక్షిణ తెలం గాణకు తీవ్ర అన్యాయం జరిగింది. నిరుద్యోగభృతిపై ఇచ్చిన హామీ అమలు చేయలేదు. పాలమూరు ప్రాజెక్టుపై కేసులు పేరు చెప్పి తప్పించుకుంటే కుదరదు. తొమ్మిదేళ్లుగా డబల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను పట్టించుకోకుండా, ఇప్పుడు భారీగా కేటాయింపులుచేస్తే ప్రజలు నమ్మరు.

- జి.మధుసూదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు

బీఆర్‌ఎస్‌ వైఫల్యం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ఈ బడ్జెట్‌ నిదర్శనం. బడ్జెట్‌లో ఎక్కడా పాలమూరు పేదరిక నిర్మూలనకు, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కేటాయింపులు జరగలేదు. రైతుల రుణమాఫీ ఎండమావిగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. దళితబంధు పథకానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలిచ్చే పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించ లేదు.

- వీరబ్రహ్మచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2023-02-06T23:32:17+05:30 IST