నాగం ఒప్పుకుంటే ఓకే

ABN , First Publish Date - 2023-03-30T23:40:19+05:30 IST

కందనూలు కాంగ్రెస్‌ టికెట్‌ విషయంలో తెలంగాణ పీసీసీ ఇతిమిద్దమైన నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డిలు కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తుండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసిన కూచకుళ్ల ప్రధాన అనుచరులకు ఇతిమిద్దమైన సమాచారం ఇచ్చారు.

నాగం ఒప్పుకుంటే ఓకే

-కూచకుళ్ల వర్గీయులకు తేల్చి చెప్పిన టీ కాంగ్రెస్‌

-తప్పనిసరిగా పోటీలో ఉంటానంటున్న నాగం

-ప్రజా క్షేత్రంలో తిరుగుతున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తనయుడు

నాగర్‌కర్నూల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : కందనూలు కాంగ్రెస్‌ టికెట్‌ విషయంలో తెలంగాణ పీసీసీ ఇతిమిద్దమైన నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్‌రెడ్డిలు కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తుండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిసిన కూచకుళ్ల ప్రధాన అనుచరులకు ఇతిమిద్దమైన సమాచారం ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ కచ్చితంగా నాగం జనార్దన్‌రెడ్డిదేనని ఆయన ఒకే చెప్పి మరొకరి పేరు ప్రస్తావిస్తే తప్ప బీఫామ్‌ ఆయనను కాదని మరొకరికి ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలిసింది. చాలాకాలంగా స్థానిక ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిల మధ్య విబేధాలున్నాయి. ఇటీవల అవి తారస్థాయికి చేరాయి. పరస్పరం విమర్శించు కునే దాకా పరిస్థితి వెళ్లింది. నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్లు కలిసి తనను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని మర్రి జనార్దన్‌రెడ్డి పరోక్షంగా ఆరోపిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తన కుమారుడిని మరింత క్రియాశీలం చేశారు. నియోజకవర్గమంతటా కలియతిప్పుతూ తన రాజకీయ వారసుడిగా కూచకుళ్ల రాజేష్‌ బరిలో ఉంటారని బహిరంగంగా చెప్పారు. బీఆర్‌ఎస్‌లోనే తన కుమారునికి టికెట్‌ వస్తుందని అంతర్గతంగా కూడా చెప్పారు. మార్కండేయ రిజర్వాయర్‌ శంకుస్థాపన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ బిజినేపల్లి బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లో మర్రిజనార్దన్‌రెడ్డి రంగంలో ఉంటారని నిస్పష్టంగా ప్రకటించడంతో కూచకుళ్ల వర్గీయుల్లో అసంతృప్తి రగిల్చింది. అయినా కూచకుళ్ల రాజేష్‌రెడ్డి మాత్రం నియోజకవర్గం లో తన పర్యటనలను ఆపలేదు. ఈ నేపథ్యంలో కూచకుళ్ల వర్గీయులు ఇటీవల రేవంత్‌రెడ్డిని కలిశారు. కూచకుళ్ల రాజేష్‌కు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అయితే తమకు ఇద్దరు నాయకుల పట్ల సమానమైన గౌరవం ఉందని, సీనియర్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డికే బీఫామ్‌ ఇస్తామని, లేదంటే ఆయన సూచించిన వ్యక్తే రంగంలో ఉంటారని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే నాగం జనార్దన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తానే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించడం హాత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్‌ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి కచ్చితంగా పోటీలో ఉంటే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి ఏ పార్టీలో నుంచి బరిలోకి దిగుతారనే అంశంలో కూడా రాజకీయ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. బీజేపీయేతర శక్తుల నుంచి తమకు మద్దతు ఎక్కువగా లభించే అవకాశం ఉన్నందున ఏ పార్టీ టికెట్‌ దక్కకపోతే ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేయడానికి కూడా కూచకుళ్ల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మర్రిజనార్దన్‌రెడ్డిని ఓడించడమే తమ ఏకైక లక్ష్యమైనందున ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి నిలబడి తమకున్న మద్దతుదారుల ఓట్లను తీసుకోగలిగితే మర్రిజనార్దన్‌రెడ్డిని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు బీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం కూడా కూచకుళ్లకు అంతర్గతంగా మద్దతునిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-03-30T23:40:19+05:30 IST